MP R Krishnaiah: బీసీ రిజర్వేషన్ల సాధనకు మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమం
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:45 AM
బీసీ రిజర్వేషన్ల సాఽధనకు మిలియన్ మార్చ్ తరహాలో భవిష్యత్తు పోరాటాలు చేపడతామని ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
రాంనగర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల సాఽధనకు మిలియన్ మార్చ్ తరహాలో భవిష్యత్తు పోరాటాలు చేపడతామని ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి.. వెంటనే 42 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 9ను చేర్చాలని సూచించారు. బీసీ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ఉద్యమకారులపై సర్కారు అక్రమంగా కేసులు పెట్టిందని.. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత.. కే ంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం వెనక అగ్రవర్ణాల కుట్ర దాగి ఉందన్నారు. త్వరలోనే బీసీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.