BC Reservations: తమిళనాడు తరహాలోనే రాష్ట్రంలో బీసీ కోటా అమలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:28 AM
తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలవుతాయని బీసీ నేతల కీలక సమావేశం ధీమా వ్యక్తం చేసింది...
బీసీ నేతల ధీమా.. పొన్నం నేతృత్వంలో సమావేశం
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలవుతాయని బీసీ నేతల కీలక సమావేశం ధీమా వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైన అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లపై న్యాయపరమైన అంశాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రిజర్వేషన్లు కల్పించే విషయంలో హైకోర్టులో గెలిచి తీరతామని బీసీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద మూడు నెలలకు మించి బిల్లులు పెండింగ్‌లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలవుతాయనే ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీనియర్ నేత వీ హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితర బీసీ నేతలు పాల్గొన్నారు.