Share News

BC Reservation: హైకోర్టులోనే బీసీ మంత్రులు

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:24 AM

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగినంత సేపూ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్‌..

BC Reservation: హైకోర్టులోనే బీసీ మంత్రులు

  • ప్రజాప్రతినిధులు కూడా వారితోనే.. కేసు వాయిదా అనంతరం ఏజీతో చర్చలు

  • గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌తో భేటీ

  • కేసు కచ్చితంగా గెలుస్తాం: పీసీసీ చీఫ్‌

  • బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేసులో ఇంప్లీడ్‌ అవ్వండి

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌, మజ్లి్‌సలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వినతి

  • నేడూ హైకోర్టుకు బీసీ మంత్రులు

  • తీర్పు రాగానే మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌!

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగినంత సేపూ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, కొండా సురేఖలు కోర్టు హాల్లోనే ఉన్నారు. వారితో పాటుగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, బీసీ వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా న్యాయస్థానంలోనే ఉండిపోయారు. విచారణను గురువారానికి వాయిదా వేసిన అనంతరం మంత్రులు అడ్వొకేట్‌ జనరల్‌తో భేటీ అయ్యారు. కేసు విచారణ జరిగిన తీరు కచ్చితంగా ప్రభుత్వానికి ఊరటేనని ఏజీ అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలపై కోర్టు స్టే ఇవ్వనందున షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చన్నారు. ఏజీతో సమావేశం అనంతరం మంత్రులు పొన్నం, వాకిటి, విప్‌ ఆది శ్రీనివాస్‌ తదితరులు నేరుగా గాంధీభవన్‌కు చేరుకుని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌తో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని, కోర్టులో కేసు కచ్చితంగా గెలుస్తామని మహేశ్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచే ప్రారంభం అవుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 90 శాతం సీట్లను గెలుచుకోనుందని చెప్పారు. బీసీల నోటికాడ ముద్దను లాగే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌, మజ్లి్‌సలు ఇంప్లీడ్‌ కావాలి

బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్ద తు తెలిపినట్లుగానే హైకోర్టులోనూ బీసీలకు మద్దతుగా కేసులో ఇంప్లీడ్‌ కావాలంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలి సారిగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ ఇచ్చి ముందుకు వెళుతున్న ప్రభుత్వం తమదేనన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42ు రిజర్వేషన్ల అమలుపై ప్రభు త్వం తరఫున బలంగా వాదన లు వినిపించామన్నారు. రిజర్వేషన్ల విషయంలో బలహీన వర్గాలు రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉండాలని కోరారు. వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీ అమలులో కాంగ్రెస్‌ పార్టీ వెనక్కు తగ్గదన్నారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, బీసీలకు రావాల్సిన వాటా గురించే కొట్లాడుతున్నామని చెప్పారు. కాగా, తెలంగాణలో బీసీల కలలు నెరవేరే విధంగా 42ు రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గురువారంనుంచి నామినేషన్లు ప్రారంభమయ్యేలా సానుకూల వాతావరణం ఏర్పడిందని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ పేర్కొన్నారు.

నేడు కోర్టు ఏం చెబుతుందో?

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం జరగనున్న విచారణపైనే అందరూ దృష్టి సారించారు. పరిషత్‌, పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభం కానుండడంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై కోర్టు స్పష్టత ఇస్తుందా? లేదా? అని ఎదురుచూస్తున్నారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ఇతర నాయకులు గురువారం కూడా కోర్టుకు వెళ్లనున్నారు. హైకోర్టు ఈ కేసును తేల్చేస్తే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మంత్రులతో సీఎం రేవంత్‌ సమావేశం కానున్నట్లు తెలిసింది.

Updated Date - Oct 09 , 2025 | 05:24 AM