BC Reservation: జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:35 AM
దేశంలో రిజర్వేషన్లపై 50ు పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే సామాజిక తిరుగుబాటు తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలపక్ష...
లేదంటే దేశవ్యాప్త తిరుగుబాటే
ఢిల్లీ బీసీ మహా ధర్నాలో అఖిలపక్షం, బీసీ సంఘాల జేఏసీ హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో రిజర్వేషన్లపై 50ు పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే సామాజిక తిరుగుబాటు తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నాన్చుడు ధోరణికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు మేరకు సోమవారం జంతర్‌మంతర్‌లో జరిగిన మహా ధర్నాలో బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉధృతం చేస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రెండుసార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ప్రధాని మోదీనెందుకు కలవడం లేదని జాజుల ప్రశ్నించారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. బీసీలకు బద్ధ శత్రువుగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయని బీజేపీని, ఒత్తిడి తీసుకురాని కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించబోరని, వారికి తగిన బుద్ది చెబుతామని జాజుల హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ అఖిలపక్షంతో ప్రధాని మోదీని ఎందుకు కలవడం లేదని బీసీ సంఘాల నేతలు అడ్డు తగిలారు. సీపీఐ నేత కె.నారాయణమాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందన్నారు. ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌శ కుమార్ గౌడ్, ఎంపీలు మల్లు రవి (కాంగ్రెస్), వద్దిరాజు రవిచంద్ర (బీఆర్‌ఎస్), మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌రావు పాల్గొన్నారు.
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ వరప్రసాద్ యాదవ్ అధ్వక్షతన సోమవారం ఏపీ భవన్‌లో సెమినార్ జరిగింది. మహిళల మాదిరే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పనకు ప్రధాని మోదీ సత్వరం చర్యలు తీసుకోవాలని, అందుకు అన్ని పార్టీలు సహకరించాలని సెమినార్‌లో పాల్గొన్న వక్తలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో 34ు రిజర్వేషన్ కల్పనకు కేంద్రంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సెమినార్‌లో ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు మాట్లాడారు.