BC Leaders: బీసీ రిజర్వేషన్ల కోసం మహోద్యమం
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:57 AM
బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని అమలు చేయకుండా హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించడంపై బీసీ అఖిలపక్ష నేతలు భగ్గుమన్నారు...
కోర్టులను ఆశ్రయిస్తూనే ప్రజా పోరాటాలు
బీసీ అఖిలపక్ష నేతల సమావేశంలో తీర్మానం
ఖైరతాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని అమలు చేయకుండా హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించడంపై బీసీ అఖిలపక్ష నేతలు భగ్గుమన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా పోరాడుతూనే తెలంగాణ ఉద్యమం మాదిరిగా పోరాటానికి సిద్ధం కావాలని తీర్మానించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం లక్డీకపూల్‌లోని అశోకా హోటల్‌లో బీసీ ప్రజా ప్రతినిధుల, బీసీ కుల సంఘాల, అఖిలపక్ష సమావేశం ఎంపీ ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటానికి ఇదే సరైన సమయమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని తెలిపారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు అమలయ్యేలా అందరం కలసి పని చేయాలని మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఇక్కడ కూడా రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ, పార్లమెంట్‌లో కృషి జరగాలని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో పోరాడుతూనే ప్రజా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లే మన వద్ద అమలయ్యేలా బీసీలు ఐక్యంగా పోరాడాలని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివా్‌సగౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మల్క కొమురయ్యతో పాటు కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.