BC Leaders Protest Reduction of Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వకపోతే అగ్నిగుండమే
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:55 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి కుదిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి....
ఖైరతాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి కుదిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకాలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ, ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు, బీసీ అఖిలపక్ష నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని, చట్టబద్దంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఇండియా కూటమికి పార్లమెంటులో 240 మంది ఎంపీలున్నారని, ఒక్క రోజైనా వారు ఈ విషయంపై సభలో ప్రశ్నించలేదన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై గుణపాఠం నేర్పాల్సిందేనన్నారు. సినీనటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పేరున్న న్యాయవాదులను నియమించి కేసు గెలిచేలా కృషి చేయాలన్నారు. 130 బీసీ కుల సంఘాలు, 45 బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు ఉద్యోగ, విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు.