Jajula Srinivas Goud: జీవో 46తో బీసీలకు రాజకీయ సమాధి
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:30 AM
బీసీలను రాజకీయంగా అణచివేసేందుకే ప్రభుత్వం జీవో 46ను తీసుకువచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు...
అంబర్‌పేట, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): బీసీలను రాజకీయంగా అణచివేసేందుకే ప్రభుత్వం జీవో 46ను తీసుకువచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేసి అగ్రవర్ణాల వారికి ప్రాముఖ్యత ఇచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. జీవో 46కు వ్యతిరేకంగా అంబర్‌పేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో 46 ప్రతులను వారు చించివేశారు. అనంతరం జాజుల మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 46ను రద్దు చేయాలని, లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ చేసుకున్న చీకటి ఒప్పంద ఫలితమే జీవో 46 అని విమర్శించారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో-చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.