Share News

Congress Party: బీసీలకు పట్టం

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:07 AM

తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న వేళ.. జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారథులను నియమించింది.

Congress Party: బీసీలకు పట్టం

  • జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు కొత్త అధ్యక్షులు

  • 9 మంది ఓసీలు, ఎస్టీ-6, ఎస్సీ-5, ఇద్దరు మైనారిటీ నేతలకు పట్టం

  • ఐదుగురు ఎమ్మెల్యేలు, శాట్‌ చైర్మన్‌ కూడా..

  • సంగారెడ్డి, రంగారెడ్డి మినహా 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు నియామకం

  • 36 మందితో జాబితా ప్రకటించిన ఏఐసీసీ

  • నియామకాల్లో సామాజిక సమతుల్యం

  • జాబితాలో ఐదుగురు మహిళా నేతలు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నవంబరు22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న వేళ.. జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారథులను నియమించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా పార్టీ పునర్‌వ్యవస్థీకరించుకున్న 33 జిల్లాలు, 3 కార్పొరేషన్‌లకు డీసీసీ అధ్యక్షుల నియామకం జరిపింది. ఈ మేరకు 36 మందితో కూడిన జాబితాను ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు ఈ నియమాకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా, డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పార్టీ సామాజిక సమతుల్యం పాటించింది. 14 డీసీసీలను బీసీలకు కట్టబెట్టింది. 9 మంది ఓసీలు, ఆరుగురు ఎస్టీలు, ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీలకు అవకాశం కల్పించింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌కు సైతం డీసీసీ అధ్యక్ష పదవులు దక్కాయి. డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యేల్లో బీర్ల అయిలయ్య (ఆలేరు), మేడిపల్లి సత్యం (చొప్పదండి), మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ (రామగుండం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్‌), చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట), తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్‌) చైర్మన్‌ కె.శివసేనారెడ్డి ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వజ్రేశ్‌కుమార్‌ యాదవ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీచేసి ఓడిన ఆత్రం సుగుణను డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్‌ నియమించింది. వీరితోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన లకావత్‌ ధన్వంతి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా విద్యార్థి నేత పున్నా కైలాశ్‌ నేతకు సైతం డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.

Updated Date - Nov 23 , 2025 | 05:51 AM