Share News

Students Complain of Poor Food: నాణ్యత లేని భోజనం.. సిబ్బంది దురుసు ప్రవర్తన

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:25 AM

నాణ్యత లేని ఆహారం.. ఉపాధ్యాయులు, సిబ్బంది దురుసు ప్రవర్తన.. అపరిశుభ్ర మరుగుదొడ్లు వంటి కారణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జ్యోతిబాపూలే బీసీ....

Students Complain of Poor Food: నాణ్యత లేని భోజనం.. సిబ్బంది దురుసు ప్రవర్తన

  • ప్రిన్సిపాల్‌ పట్టించుకోవడం లేదంటూ గురుకులాల విద్యార్థుల గోడు

  • శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు

శామీర్‌పేట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నాణ్యత లేని ఆహారం.. ఉపాధ్యాయులు, సిబ్బంది దురుసు ప్రవర్తన.. అపరిశుభ్ర మరుగుదొడ్లు వంటి కారణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పోలీసుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో గురువారం చోటు చేసుకుంది. శామీర్‌పేట పరిధిలోని ఓ కళాశాల భవనంలో మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ కు చెందిన మూడు గురుకుల పాఠశాలలు (శామీర్‌పేట, హైదరాబాద్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాలు) అద్దెకు నడుస్తున్నాయి. శామీర్‌పేట గురుకుల పాఠశాలలో 350 మంది విద్యార్థులు, హైదరాబాద్‌ గురుకులంలో 350 మంది, కుత్భుల్లాపూర్‌ క్యాంప్‌సలో 410 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ మూడు పాఠశాలలకు ఒకే ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ వై రవికుమార్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, గురువారం ఈ గురుకులాలకు చెందిన దాదాపు 60 మంది విద్యార్థులు ర్యాలీగా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి ఎస్‌ఐ శ్రీనాథ్‌కు సమస్యలపై ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ నాణ్యతలేని భోజనాన్ని బలవంతంగా తింటున్నామని, ఆహారంలో తరచుగా పురుగులు, రాళ్లు వస్తున్నాయని వాపోయారు. టీచర్లు మహేందర్‌, గోపాల్‌లతో పాటు డిప్యూటీ వార్డెన్‌ ఓంప్రకాశ్‌లు చిన్న చిన్న కారణాలకే దుర్భాషలాడుతున్నారని, వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. గురుకుల పరిసరాల్లో అశుభ్ర వాతావరణం, ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్వహణ లోపం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. మరుగుదొడ్లకు డోర్లు, ట్యాప్‌ వాటర్‌ సౌకర్యాలు లేక నరకయాతన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని, అందుకే తాము పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లామని విద్యార్థులు మీడియాకు తెలిపారు. అనంతరం క్యాంప్‌సకు చేరుకుని ఆ పాఠశాల ఆవరణలో బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థుల ఫిర్యాదుల పట్ల తీవ్రంగా స్పందించిన పలువురు అధికారులు.. పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపారు.

Updated Date - Dec 12 , 2025 | 04:25 AM