TPCC president Mahesh Goud: బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:54 AM
పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా పడింది..
15న కామారెడ్డిలో నిర్వహించాలని ఇంతకుముందు పీసీసీ నిర్ణయం
భారీ వర్ష సూచన నేపథ్యంలో వాయిదా
సభ నిర్వహణ తేదీని మళ్లీ ప్రకటిస్తాం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్
కామారెడ్డి/హైదరాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా పడింది. కామారెడ్డి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు.. రెండు రోజులుగా కామారెడ్డిలోనే ఉంటూ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని కార్యకర్తలతో శుక్రవారం ఆమె సమావేశం కాగా, టీపీసీసీ నుంచి అందిన సమాచారం మేరకు సభ వాయిదా పడినట్లు తెలిపారు.
కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదు: సీతక్క
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్యేల డీఎన్‌ఏపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు బీఆర్‌ఎస్ ఏం చేసిందని నిలదీశారు.