BC Bathukamm: బీసీ బిల్లు సాధన కోసం బీసీ బతుకమ్మ
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:44 AM
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలనే డిమాండ్లతో...
24న ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహణ: జాజుల శ్రీనివా్‌సగౌడ్
హైదరాబాద్/కవాడిగూడ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలనే డిమాండ్లతో ఈనెల 24న ట్యాంక్ బండ్ వద్ద ‘బీసీ బతకమ్మ’ నిర్వహించనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ భవన్‌లో జరిగిన బీసీ మహిళా సంఘం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ వేడుకలను ఈ సంవత్సరం బీసీ బతుకమ్మగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని, ప్రధాని మోదీ మనసు కరిగి తమ ఆకాంక్షలు నెరవేర్చాలని బీసీ బతుకమ్మను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు పాల్గొనాలని కోరారు. కాగా, అధికార సాధన కోసం బీసీలలో రాజకీయ చైతన్యాన్ని పెంచడానికి పాటనే ఆయుధంగా చేసుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ కవులు, కళాకారులు, రచయితలు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.