Share News

Panchayat Elections: బీసీల విజయబావుటా

ABN , Publish Date - Dec 14 , 2025 | 06:12 AM

రాష్ట్రంలో మొదటి దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు.

Panchayat Elections: బీసీల విజయబావుటా

  • పంచాయతీ తొలి విడతలో 41.7ు స్థానాల్లో బీసీలదే గెలుపు

  • కేటాయించిన దాని కంటే రెట్టింపు సీట్లలో విజయం

  • 4,230లో 1,764 సీట్లు బీసీలవే.. జనరల్‌ స్థానాల్లోనూ సత్తా

  • హనుమకొండలో అత్యధికంగా 48 స్థానాలు సొంతం

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొదటి దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన రిజర్వ్‌డ్‌ స్థానాల కంటే ఎక్కువ సీట్లలో గెలిచారు. జనరల్‌ స్థానాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో సర్పంచ్‌లుగా ఎన్నికవ్వడం విశేషం. 31 జిల్లాల్లోని 4,236 గ్రామ పంచాయతీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో ఆరు స్థానాలు మినహా 4,230 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తం1,764 స్థానాల్లో బీసీ అభ్యర్థులు విజయం సాధించారు.916 జనరల్‌ స్థానాల్లో, 848 బీసీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో గెలుపొందారు. నిజానికి, బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ, కోర్టు తీర్పు నేపథ్యంలో 42ు రిజర్వేషన్లు అమలు కాలేదు. దాంతో తొలి దశలో పాత పద్ధతిలో 20 శాతం వరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ, అంతకంటే ఎక్కువ స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన మొత్తం 4,230 స్థానాల్లో 1,764 స్థానాలు గెలుచుకున్నారు. అంటే, 41.7ు సీట్లలో బీసీలు విజయం సాధించారు. ఈ లెక్కన బీసీలు రెట్టింపు స్థానాల్లో గెలిచినట్లయింది. హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో బీసీలు సత్తా చాటారు. అన్ని జిల్లాల కంటే అత్యధికంగా హనుమకొండ జిల్లాలో బీసీలు 69.6 శాతం సీట్లను గెలుచుకున్నారు. రాష్ట్రంలో ఇదే అత్యధికం. హనుమకొండ జిల్లాలో మొత్తం 69 స్థానాలకుగాను బీసీలు జనరల్‌ స్థానాల్లో 22, రిజర్వ్‌డ్‌ స్థానాల్లో 26 సీట్లు మొత్తం 48 సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్నారు.


రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా 65.6 శాతంతో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలోని 99 స్థానాలకుగాను జనరల్‌ స్థానాల్లో 38, రిజర్వ్‌డ్‌ స్థానాల్లో 27 మొత్తం 65 సీట్లలో బీసీలు గెలుపొందారు. గద్వాల జిల్లాలో 65.1 శాతం, సిద్దిపేటలో 62.6 శాతం, కరీంనగర్‌ జిల్లాలో 60.8 శాతం, జగిత్యాలలో 59.8 శాతం, నల్లగొండలో 56.9 శాతం సీట్లలో బీసీలు విజయం సాధించారు. కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఒక్క సీటూరిజర్వ్‌ కాకపోవడంతో అతి తక్కువగా 0.6 శాతం సీట్లను మాత్రమే గెలుచుకున్నారు. జిల్లాలో 159 సర్పంచ్‌ స్థానాలకు ఒక్క బీసీనే గెలిచారు. తక్కువ స్థానాలు సాధించిన జిల్లాల్లో 7శాతంతో ఆసిఫాబాద్‌, 7.2శాతంతో ఆదిలాబాద్‌, 8.3శాతంతో ములుగు జిల్లాలు నిలిచాయి. కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, ములుగు జిల్లాలు 1(70)చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో రిజర్వ్‌స్థానాలు లేకపోవడంతో బీసీల విజయాల సంఖ్య తక్కువగా ఉంది.

Updated Date - Dec 14 , 2025 | 06:13 AM