BAS Students Denied Entry: బీఏఎస్ విద్యార్థులను రానివ్వట్లేదు!
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:32 AM
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకం కింద చదువుతున్న విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు రానివ్వడంలేదు. వీరికి సంబంధించి ప్రభుత్వం..
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
బకాయిల విడుదల కోసం యాజమాన్యాల పట్టు
నేడు ఉపముఖ్యమంత్రిని కలుస్తాం:బీఏఎస్ అసోసియేషన్
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకం కింద చదువుతున్న విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు రానివ్వడంలేదు. వీరికి సంబంధించి ప్రభుత్వం ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేసే వరకు పాఠశాలలకు రానివొద్దన్న నిర్ణయం మేరకు యాజమాన్యాలు పట్టువీడటం లేదు. దసరా సెలవుల తర్వాత పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కాల్సి వచ్చింది. విద్యార్థులను అనుమతించాలని, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించినా.. బీఏఎస్ యాజమాన్యాలు దిగిరావడం లేదు. బకాయిలు వచ్చే వరకు వారిని రానివ్వబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద దాదాపు 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారు. వారికి రెండున్నరేళ్లుగా నిధులు మంజూరు చేయకపోవడంతో రూ.180 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయాలని బీఏఎస్ యాజమాన్య సంఘం నేతలు వినతి పత్రాలు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో దసరా సెలవులు ముగిశాక పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను వెనక్కు పంపారు. దీంతో చదువులకు ఇబ్బంది కలుగుతుందని, అనుమతించాలని విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. యాజమాన్యాలు పట్టు వీడకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బకాయి బిల్లుల గురించి శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలవనున్నట్లు బీఏఎస్ అసోసియేషన్ నేతలు తెలిపారు.