CPI National Secretary Palla Venkat Reddy: బ్యాంకులను నెహ్రూ జాతీయం చేస్తే... మోదీ ప్రైవేట్ పరం చేస్తున్నారు
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:09 AM
బ్యాంకులను నెహ్రూ జాతీయం చేస్తే.. మోదీ ప్రైవేట్ పరం చేస్తున్నారని, ప్రైవేట్ కార్పోరేట్‌కు కొమ్ముకాయడమే మోదీ ప్రభుత్వ ప్రధాన సిద్ధాంతమని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి విమర్శించారు.
వందేళ్లుగా సీపీఐ పేదల పక్షాన పోరాడుతోంది
సీపీఐ శతాబ్ది సభలో నాయకులు.. భారీ ర్యాలీ
హిమాయత్‌నగర్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులను నెహ్రూ జాతీయం చేస్తే.. మోదీ ప్రైవేట్ పరం చేస్తున్నారని, ప్రైవేట్ కార్పోరేట్‌కు కొమ్ముకాయడమే మోదీ ప్రభుత్వ ప్రధాన సిద్ధాంతమని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఆర్థిక, రాజకీయ అరాచకాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా వామపక్ష, ప్రజాస్వామ్య వాదులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ హైదరాబాద్ నగర కౌన్సిల్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హిమాయత్‌నగర్ నుంచి నారాయణగూడ వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన శతాబ్ది సభలో సీపీఐ నాయకులు మాట్లాడారు.బీజేపీకి, ఎంఐఎంకు ఏ చరిత్రా లేదని, వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిర్విరామంగా పోరాడుతూనే ఉందని చెప్పారు. పార్టీ నగర కార్యదర్శి స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీపీఐ, అనుబంద సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.