బ్యాంకు స్కామ్‌లో రూ. 13.71 కోట్లు స్వాహా
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:58 PM
పట్టణంలోని ఎస్‌బీఐ 2 బ్యాంకులో క్యాషియర్ మొత్తంగా రూ. 13.71 కోట్ల బంగారం, నగదు స్వాహా చేసినట్లు తెలిసింది. బ్యాంక్‌లో జరిగిన స్కామ్‌పై కొనసాగుతున్న ఆడిట్ శనివారం ముగిసింది.
-అసలు సూత్రదారి బ్యాంకు క్యాషియర్
-మరో 9 మంది ప్రమేయం
-ముగిసిన అధికారుల ఆడిట్
చెన్నూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని ఎస్‌బీఐ 2 బ్యాంకులో క్యాషియర్ మొత్తంగా రూ. 13.71 కోట్ల బంగారం, నగదు స్వాహా చేసినట్లు తెలిసింది. బ్యాంక్‌లో జరిగిన స్కామ్‌పై కొనసాగుతున్న ఆడిట్ శనివారం ముగిసింది. బ్యాంకు రీజనల్ మేనేజర్ రితీష్‌కుమార్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం 402 మంది ఖాతాదారులకు చెందిన గోల్డ్‌లోన్ బంగారం 20 కిలోల 490 గ్రాములు, నగదు రూ. 1,10,27,617 స్వాహా అయినట్లు తేలింది. బ్యాంకు క్యాషియర్ రవీందర్ ఈ స్వాహాపర్వానికి సూత్రాధారి కాగా మరో 9 మంది ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. బ్యాంకులో ప్రైవేటు అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న లక్కాకుల సందీప్‌తోపాటు క్యాషియర్ రవీందర్, మిత్రులు, సన్నిహితులైన కొంగండి దీరేష్, నరిగె సరిత, నరిగె స్వర్ణలత, ఉమ్మల సురేష్, కోదటి రాజశేఖర్, గౌడ సుమన్, యేసంపల్లి సాయికిరణ్, మోత్కూరి రమ్య వీరి పేర్లపై ఉన్న అకౌంట్‌లకు ఈ నగదు బదిలీ అయినట్లు తేలింది. మళ్లీ వీరి అకౌంట్‌ల నుంచి 50 మంది అకౌంట్‌కు నగదు బదిలీ అయి చివరకు మళ్లీ క్యాషియర్ రవీందర్ అకౌంట్‌కుచేరింది.
-అధికారుల వైఫల్యమే కారణం
బ్యాంకులో జరిగిన స్కామ్‌కు సంబంధించి అధికారుల వైఫల్యమేకారణమని తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబరు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు 20 వరకు బంగారంతో పాటు నగదు స్వాహా అయినా అధికారులు గుర్తించకపోవడం వారి వైఫల్యమేననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతుండగా గడిచిన 10 నెలల కాలంలో రెండు సార్లు ఆడిట్ జరిగినా ఆ సమయంలో అధికారులు ఎందుకు గుర్తించలేలేకపోయారనే ప్రశ్న తలెత్తుతోంది. 4-6-2025న కిష్టంపేట ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు బ్యాంకులో ఆడిట్ నిర్వహించారు. బంగారంతో పాటు నగదు సరిగ్గానే ఉందని లెక్క తేల్చడం వెనక ఆంతర్యం ఏంటన్నది తెలియడం లేదు. ఇదంతా పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు బయట పడుతున్నాయి.
- పది మందిపై పోలీసులకు ఫిర్యాదు
భారీ స్కామ్‌లో కీలక పాత్ర వహించిన క్యాషియర్ నరిగె రవీందర్‌తో పాటు మరో 9 మందిపై శనివారం బ్యాంకు అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో నిర్వహించిన సమావేశంలో రీజనల్ మేనేజర్ రితీష్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి పైసా, బంగారం, రికవరీ చేస్తామన్నారు. మరో వైపు బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాషియర్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ దేవేందర్‌రావు తెలిపారు.
-పోలీసుల అదుపులో నిందితులు
బ్యాంకు భారీ స్కామ్‌లో అసలు సూత్రధారితో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్వాహా అయిన బంగారం ఎక్కడుంది. అలాగే అకౌంట్‌లకు బదిలీ అయిన నగదు ఎక్కడుందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏపిసోడ్‌లో మరో 50 మంది ఖాతాదారులు ఉంటారని తెలుస్తుంది. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం ఉన్నట్లు తెలుస్తుండగా నిందితులను అరెస్టు చేస్తే కానీ ఎవరి ఖాతాలోకి ఎంత వెళ్లిందనేది తెలియరాదు.
-విచారణ చేపట్టిన ఏసీపీ
బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో పాటు చెన్నూరు సీఐ దేవేందర్‌రావు, రూరల్ సీఐ బన్సీలాల్, ఎస్‌ఐలు విచారణ చేపట్టారు. శనివారం రాత్రి బ్యాంకుకు చేరుకున్న ఏసీపీ అన్ని రికార్డులతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ కొనసాగిస్తున్నారు.