Bandi Sanjay: చెక్‌డ్యామ్‌ల నాణ్యతపై విచారణ చేయించండి
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:21 AM
రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యామ్‌ల నిర్మాణ నాణ్యతపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. నాసిరకంగా చెక్ డ్యామ్‌లు కట్టి, కూలిపోవడానికి కారకులైన కాంట్రాక్టర్లపై......
అవి కూలిపోయేలా కట్టిన కాంట్రాక్టర్లపై కేసు పెట్టండి
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
‘బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను’ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల నిధులిస్తానని ప్రకటన
హైదరాబాద్/హుస్నాబాద్/కరీంనగర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యామ్‌ల నిర్మాణ నాణ్యతపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. నాసిరకంగా చెక్ డ్యామ్‌లు కట్టి, కూలిపోవడానికి కారకులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నష్టపోయిన ప్రజాధనాన్ని రాబట్టేందుకు కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంజయ్ మంగళవారం సీఎంకు లేఖ రాశారు. ‘‘కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌ల పరిస్థితి దారుణంగా తయారైంది. నాసిరకం నిర్మాణాలతో చాలాచోట్ల నిర్మాణాలు కూలిపోయాయి. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ ధ్వంసమైంది. 2021 వరదల్లోనూ చాలా వరకు చెక్ డ్యామ్‌లు ధ్వంసమయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో చెక్ డ్యామ్‌ల నిర్మాణం, నిధుల చెల్లింపుపై మే నెలలో మీరే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మానేరు నదిపై 57 చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.287 కోట్లు చెల్లించిన దానిపై మీరు విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారు. ఆ విచారణ ఏమైందో నేటి వరకు తెలియదు. బీఆర్‌ఎస్ పాలనలో చెక్ డ్యామ్ కాంట్రాక్టులను మీ పార్టీ నాయకులే చేజిక్కించుకున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి బీఆర్‌ఎస్ పాలకులు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పర్యవేక్షణను గాలికొదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది’ అని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు ఇస్తానని సంజయ్ ప్రకటించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల నిధులిస్తానని హామీ ఇచ్చి.. నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా మోసం చేసిందన్నారు. కాగా, రాష్ట్రం లో భూ బకాసురులు రాజ్యమేలుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవో 27ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని పంచాయతీల్లో పోటీ: బీజేపీ
పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి పంచాయతీలో వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు తాము బలపరచిన అభ్యర్థులు పోటీచేస్తారని ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.