Bandi Sanjay: కార్ పార్టీ.. అక్రమ లగ్జరీ కార్లపై నడుస్తోందా
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:37 AM
కార్ పార్టీ (బీఆర్‌ఎస్) అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
బసరత్ ఖాన్ దిగుమతి చేసుకున్న
ల్యాండ్ క్రూజర్‌లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు?
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బసరత్ స్మగ్లింగ్ చేసిన కార్లు 8.. విచారణలో నంబర్లూ వెల్లడి
అందులో టీజీ 00డి 6666 నంబరు కారు కేటీఆర్ కాన్వాయిలో
ఎట్‌హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ పేరుతో వాహనం రిజిస్టర్
ఆ సంస్థ డైరెక్టర్ కేటీఆర్ భార్య శైలిమ.. దర్యాప్తు చేస్తున్న డీఆర్‌ఏ
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కార్ పార్టీ (బీఆర్‌ఎస్) అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బసరత్ ఖాన్ అక్రమంగా దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లలో ఒకదాంట్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కారు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేరుతో ఎందుకు రిజిస్టర్ అయింది? మార్కెట్ ధర చెల్లించారా? లేదంటే ధర తక్కువగా చూపించి కొనుగోలు చేశారా? చెల్లింపులు బినామీ పేర్లతో జరిగాయా? మనీలాండరింగ్ జరిగిందా? అని నిలదీశారు. ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా?’ అని సంజయ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎనిమిది కార్లను స్మగ్లింగ్ చేసినట్లు డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారుల విచారణలో ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్ అంగీకరించారు. ఆ వాహనాల నంబర్లనూ అధికారులకు బసరత్ ఖాన్ అందజేశారు. ఆ నంబర్లలో టీజీ00డి 6666 నంబరు గల ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని తన కాన్వాయిలో కేటీఆర్ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్‌ఖాన్ చెప్పారు.
కాగా కేటీఆర్ కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ వాహనం, ఎట్‌హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. దీంతో, ఎట్‌హోం హాస్పిటాలిటీ సర్వీసె్‌సకు, కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాలపై డీఆర్‌ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేటీఆర్ సతీమణి శైలిమ, ఎట్‌హోం హాస్పిటాలిటీ సర్వీస్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, బసరత్‌ఖాన్‌కు, కేటీఆర్‌కు మధ్య ఎలా పరిచయం ఏర్పడింది? ఎట్‌హోం హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే సంస్థ ఎలా ఏర్పడింది? అందులో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు? తదితర అంశాలపై డీఆర్‌ఐ లోతుగా దర్యాప్తు చేస్తోందని సమాచారం. బండి సంజయ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని.. ఆయన ఏ షోరూంలో కొన్నారో అక్కడే కేటీఆర్ కూడా కొన్నారని బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.