Union Minister Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్ర బయటపెట్టాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:59 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు...
కేసీఆర్, కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం సబబే: బండి సంజయ్
హైదరాబాద్, మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ కేసీఆర్, కేటీఆర్‌కు నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారు తప్పితే చర్యల్లేవు. ఈ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియళ్ల ఎపిసోడ్‌లు అయిపోయాయి గానీ కేసు మాత్రం సాగుతూనే ఉంది. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. బడా పారిశ్రామికవేత్తలను, నాయకులను ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేసిన వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలి. ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాలి’ అని సంజయ్ డిమాండ్ చేశారు. తనతో పాటు పలువురు అగ్రనేతల ఫోన్‌లు ట్యాప్ చేశారని, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ తన కూతురు, అల్లుడి ఫోన్‌లు కూడా ట్యాప్ చేయించారని దుయ్యబట్టారు. కాగా, అల్లుడి ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన బిడ్డ కవితకు కేసీఆర్ మొదట సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు ఎవరు చేసినా పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.