Bandi Sanjay: మహిళా అధికారులను వేధిస్తున్నమంత్రులను బర్తరఫ్ చేయాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:30 AM
రాష్ట్ర క్యాబినెట్‌లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రి పూట ఇళ్లకు, కార్యాలయాలకు పిలిపించుకొని వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని....
రాత్రిపూట ఇళ్లకు, ఆఫీసులకు పిలిపించిమంత్రులు వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి
దీనిపై విచారణ చేపట్టాలి: బండి సంజయ్
కరీంనగర్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర క్యాబినెట్‌లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రి పూట ఇళ్లకు, కార్యాలయాలకు పిలిపించుకొని వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా అధికారులను వేధిస్తున్న ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరిపించి, నివేదిక తెప్పించుకోవాలని కోరారు. కరీంనగర్‌లో బండి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలన అంటే మహిళలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, పోలీసులపైనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మజ్లి్‌సకు చెందిన రౌడీషీటర్లు పోలీసులను హత్య, హత్యాయత్నం చేసే స్థాయిలో పెట్రేగి పోతున్నారని.. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే రౌడీషీటర్లపై యూపీ తరహాలో ఉక్కుపాదం మోపాలన్నారు. జూబ్లీహిల్స్‌లో ఒక వర్గం ఓట్ల కోసం మజ్లిస్ కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోయిందని విమర్శించారు. అప్పట్లో బీఆర్‌ఎస్ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కాళ్లు మొక్కే దుస్థితిలో ఉండిందని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడల్లా మజ్లి్‌సను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలు మానుకోవాలని, డీసీపీ చైతన్యపై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.