Union Minister Bandi Sanjay: మాగంటి చావుకు కారణం కేటీఆరే
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:17 AM
మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని, ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాట అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు...
రేవంత్‌కు దమ్ముంటే విచారణ జరిపించాలి
సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు
కవితక్కా.. మీ తండ్రి బాగుగోలు చూసుకో..
టోపీ పెట్టుకున్న రేవంత్‌ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తారు: కేంద్ర మంత్రి సంజయ్
బోరబండలో రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం.. బీజేపీ వర్గాల సీరియస్
అనుమతి ఉన్నా, లేకున్నా వస్తానన్న బండి
ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు
హైదరాబాద్ సిటీ/బోరబండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని, ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాట అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌కు రోషం ఉంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని, అప్పుడు అసలు విషయం బయటపడుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం రాత్రి బోరబండలో రోడ్డు షో నిర్వహించారు. ‘‘కేసీఆర్ మూర్ఖుడైతే ఆయన కుమారుడు ఇంకా మూర్ఖుడు’’ అంటూ బండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వాలని కేటీఆర్‌కు లేదని ఆరోపించారు. ఎప్పుడెప్పుడు గద్దెనెక్కుతానా? అని కేటీఆర్ చూస్తున్నారని, ఆయనకు వావివారుసలు లేవని..ముసలిముతకా అన్న తేడాలు లేవని, సీఎం పదవి చేపట్టేందుకు ఆయన ఏమైనా చేస్తారని ఆరోపించారు. అన్నదమ్ముల గురించి పట్టించుకోవొద్దని కవితకు సూచించారు. ‘‘తల్లిదండ్రులను కుమారులు పట్టించుకోరు. కూతుళ్లే చూస్తారని, కవితక్కా.. అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి పోయి బాగోగులు చూసుకుంటూ ఉండు’’ అని సూచించారు. కేసీఆర్‌పై కొట్లాడింది.. ఆయన్ను ఫామ్‌హౌ్‌సకు పరిమితం చేసింది తామేనన్నారు. ‘‘రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు’’ అంటూ రేవంత్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్ల మేర అవినీతిపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని రేవంత్‌కు సవాల్ చేశారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా.. పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అని విమర్శించారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే, తెలంగాణలో చాలాచోట్ల కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. టోపీ పెట్టుకున్న రేవంత్‌ను చూస్తే తనకు సినీనటుడు వేణుమాధవ్ గుర్తుకొచ్చారని, అజారుద్దీన్ చేత ‘వక్రతుండ మహాకాయ..’ అని గణపతి శ్లోకం చదవించే దమ్ముందా? అని ప్రశ్నించారు.
ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకుపోయి.. వారికి బొట్టు పెట్టించి వారితో అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాను టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటానని చెప్పారు. ‘‘నేను హిందువును... టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను’’ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ వాళ్లు అన్నీ ఎత్తుకొని పోతారని.. మజ్లిస్ రాజ్యం వస్తే ప్రజలు బిచ్చగాళ్లు అవుతారని హెచ్చరించారు. మజ్లిస్ నేతలు చైన్ స్నాచర్లు అని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆడవాళ్ల మెడలోని మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారని హెచ్చరించారు. పహెల్గాంలో ఉగ్రవాదులు మగవాళ్ల లోదుస్తులను విప్పదీసి.. హిందువులుగా నిర్ధారించుకొని చంపేశారని.. పాకిస్థాన్‌కు మద్దతు పలికేవారు నిజమైన హిందువులేనా? అనే విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. చార్మినార్‌పై కాషాయ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమన్నారు. ‘‘గతంలో చార్మినార్‌కు రానివ్వబోమని హెచ్చరించారు. అయినా బాగ్యలక్ష్మికి ఆలయానికి నే వెళ్లలేదా?’’ అని ప్రశ్నించారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తానని ఎన్నికల్లో రేవంత్ వాగ్దానం చేశారని.. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాననీ చెప్పారని, అయితే ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్, కేసీఆర్ ఒకటేనని.. కలిసి రూ.లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ నుంచి దొంగ ఓట్లు వేయించడానికి ప్రణాళిక వేశారని ఆరోపించారు. అందరికీ రాజ్యాంగం ఒక్కటేనని, బూత్‌లో ఓటరు ముఖం చెక్ చేసుకున్నాకే లోపలికి అనుమతించాలని పేర్కొన్నారు. బోరబండలో బీఆర్‌ఎస్ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు చేయలేదని.. పేదోళ్ల ఇళ్లు కూల్చారని ఆరోపించారు. బోరబండ వాసులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు లేవని, ఓట్లు కోసం వస్తే బీఆర్‌ఎస్ వాళ్లను నిలదీయాలని సూచించారు.
అనుమతి లేదని ప్రచారం.. తర్వాత అంతా సాఫీగా
బోరబండలో గురువారం బండి సంజయ్ తలపెట్టిన రోడ్ షో కోసం అనుమతి లేదని, ర్యాలీ కోసం ఆయనకు ఇచ్చిన అనుమతి రద్దయిందంటూ తొలుత ప్రచారం జరిగింది. ఈ పరిణామంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రోడ్ షోకు అనుమతి ఉన్నా.. లేకపోయినా తాను బోరబండ వస్తున్నానంటూ బండి సంజయ్ ప్రకటించారు. దీంతో ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.