Share News

Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:40 AM

రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకెళ్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్య చేశారు..

Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే

  • వారిద్దరూ వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు

  • నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నాం

  • త్వరలో అవినీతి బాగోతం బయటకు

  • రాష్ట్రానికి కేసీఆర్‌ కుటుంబమే పెద్ద శని

  • కేసీఆర్‌పై సీఎం మాట్లాడిన భాష తప్పు

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: బండి సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకెళ్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్య చేశారు. ‘చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఇద్దరు మంత్రులు వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. వారి అవినీతిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా చర్చించుకుంటున్నారు. మేం కూడా ఇంటెలిజెన్సు రిపోర్టులు తెప్పించుకుంటున్నాం. వారి అవినీతి బాగోతం త్వరలోనే బయటపెడతాం’ అని ఆయన ప్రకటించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాడిన భాష సరికాదని, రేవంత్‌ వాడిన భాష ఆయనకే నష్టమని అన్నారు. సీఎం హోదాలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని పేర్కొంటూ, గతంలో కేసీఆర్‌ ఇలా మాట్లాడినప్పుడు కూడా తాము ఖండించామని గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబమే తెలంగాణాకు పెద్ద శని అని, కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ‘తెలంగాణకు నం.1 ద్రోహి, దోషి కేసీఆరే. కృష్ణా జలాల వాటా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చేసిన విజ్ణప్తి మేరకే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయంగా తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి. కానీ, 299 టీఎంసీలకే కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. అవసరమైతే దీనికి సంబంధించి ఆధారాలు వెల్లడించేందుకు సిద్ధం. కాళేశ్వరం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆయన కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్‌తో నాడు ఏం ఒప్పందం జరిగిందో కేసీఆర్‌ స్పష్టం చేయాలి’ అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగితే కేవలం రూ. 9వేల కోట్ల అక్రమాలపైనే విచారణను ఎందుకు పరిమితం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబానికి ప్రమేయం ఉంది. ఈ వ్యవహారంలో, నక్సలైట్ల జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్‌ .. 6వేల మందికిపైగా ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్‌ చేసిన నీచపు చరిత్ర ఆయనది’ అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గర్లోనే..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని సంజయ్‌ జోస్యం చెప్పారు. ‘మాకున్న సమాచారం ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు.. వాళ్ల ఆవేదనను మాతో పంచుకుంటున్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. తాను కాంగ్రె్‌సలోనే ఉన్నానంటూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చేసిన ప్రకటనపై స్పీకర్‌ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్‌ ముక్త్‌ భాగ్యనగర్‌ బీజేపీ లక్ష్యమని సంజయ్‌ ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లి్‌సను ఓడించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Dec 26 , 2025 | 05:40 AM