BJP leader Bandi Sanjay: మాగంటి ఆస్తుల పంపకాల్లో రేవంత్, కేటీఆర్ మధ్య గొడవ!
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:02 AM
బీఆర్‌ఎస్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఆస్తుల పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య గొడవ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ....
ఆ ఆస్తులను ఇద్దరు నేతలు పంచుకుంటున్నారు
మృతి వెనుక మిస్టరీ ఉందని గోపీనాథ్ తల్లే చెబుతున్నా విచారణ జరపకపోవడానికి కారణం ఇదే
మాగంటి ఆస్తుల తాలూకు పత్రాలు తమ కుటుంబసభ్యుల పేరిట బదిలీ కాలేదన్న విషయాన్ని రేవంత్ చెప్పగలరా?
తెలంగాణలో ఇప్పుడున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్
కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌స కొమ్ముకాస్తున్న ఈసీ, పోలీసులు
సభల కోసం అనుమతిని నిరాకరిస్తున్నారు: సంజయ్
రహ్మత్‌నగర్‌లో బండి రోడ్ షోకు అనుమతి నిరాకరణ
మరోచోట నిర్వహించుకోవాలన్న పోలీసులు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఆస్తుల పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య గొడవ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. సాధారణంగా ఆస్తి పంపకాల గొడవ కుటుంబసభ్యుల మధ్య జరుగుతుందని.. మాగంటి ఆస్తి పంపకాల వ్యవహారంలో మాత్రం రేవంత్, కేటీఆర్ కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మాగంటి ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరి నేతల మధ్య పగ, పట్టింపులు పెరిగిపోతున్నాయని, ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం అని పేర్కొన్నారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్, మీడియా సమావేశంలో మాట్లాడారు. మాగంటి ఆస్తుల తాలూకు పత్రాలు తమ కుటుంబసభ్యుల పేరిట బదిలీ కాలేదన్న విషయాన్ని సీఎం రేవంత్ గుండెల మీదు చేయివేసుకొని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ‘‘మాగంటి ఆస్తులను మీరు, కేటీఆర్ పంచుకుంటున్నారు.. ఇది వాస్తవం కాదని చెప్పగలరా?’’ అని నిలదీశారు. గోపి ఆస్తులతో సంబంధం లేదని, ఆస్తి పంపకాల్లో భాగస్వామ్యం లేదని చెప్పగలరా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. మాగంటి మృతి వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లి చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. గోపి ఆస్తులెన్ని? ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయి? ఎలా బదిలీ అయ్యాయి? గొడవ ఎక్కడ ప్రారంభమైంది? అన్న విషయాలను తేల్చాలని డిమాండ్ చేశారు. మాగంటి ఆస్తుల్లో రేవంత్‌కు భాగస్వామ్యం ఉండటంతోనే ఆయన విచారణకు ఆదేశించడం లేదని ఆరోపించారు. ఇంతపెద్ద ఘటనపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మాగంటి మరణం తాలూకు సానుభూతితో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
మాగంటి ఇద్దరు సతీమణుల్లో ఒకరికి కాంగ్రెస్, మరొకరికి బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తున్నాయని.. ఆయన ఇద్దరు భార్యలకు వచ్చే వాటాల్లో కమిషన్లు దండుకునేందుకే ఈ రెండు పార్టీల నేతలు ఎత్తుగడ వేశారని ఆరోపించారు. తెలంగాణాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ), కాస్తా ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ)గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జుబ్లీహిల్స్‌లో బీజేపీ, ఐఎంసీ మధ్యే పోటీ జరుగుతోందన్నారు. ‘జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల కమిషన్, పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో నిరాకరిస్తున్నారని విమర్శించారు.
మాగంటి తనయుడి ప్రకటనను తేలిగ్గా తీసుకోవొద్దు
‘‘తన కుమారుడి మరణం ఒక మిస్టరీ అని గోపీనాథ్ తల్లి అన్నారు. ఆ మిస్టరీ ఏంటి? గోపి అదే రోజు చనిపోయారా? అంతకంటే ముందురోజు కన్నుమూశారా? కొంతమంది కోసం ఆలస్యంగా ఆయన మరణవార్తను ప్రకటించాల్సి వచ్చిందా?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, గోపీనాథ్ తల్లి, సతీమణి స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని విజ్ణప్తి చేశారు. తండ్రి అంత్యక్రియల కోసం తాను అమెరికా నుంచి వస్తే, బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఒకరు ఫోన్ చేసి రావొద్దని బెదిరించారంటూ గోపి తనయుడు తారక్ చేసిన ప్రకటనను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ఐసీయూలో ఉన్న తన కుమారుడిని చూపించాలని కేటీఆర్‌ను వేడుకున్నా పట్టించుకోలేదని గోపి తల్లి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఒక కన్నతల్లి ఆవేదన చూసి ప్రతి ఒక్కరు బాధపడుతున్నా సీఎం రేవంత్ గుండెమాత్రం కరగడం లేదని.. దీనికి కారణం రేవంత్, కేటీఆర్‌లు దోస్తులు కావడమేనని, వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.
రోడ్ షోకు అనుమతి నిరాకరణ
రహ్మత్‌నగర్‌లోని మీనాక్షిపురంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్ రోడ్ షోకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. బోరబండలో గురువారం ఇదే పరిస్థితి నెలకొంది. బోరబండలో రోడ్ షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడంతో వాటికి సంబంధించిన పత్రాలను బీజేపీ నేతలు విడుదల చేశారు. చివరకు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో బోరబండ సైట్-3లో రోడ్ షో నిర్వహించారు. శుక్రవారం రహ్మత్‌నగర్‌లోని మినాక్షీపురంకు వస్తున్నట్లు బండి సంజయ్ గురువారం సభలో ప్రకటించారు. అయితే రహ్మత్‌నగర్‌లో సమావేశానికి అనుమతి ఇవ్వడం లేదని, ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌కు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు శుక్రవారం ఉదయం బండిసంజయ్‌కి సమాచారం ఇచ్చారు. మరో చోట సభను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4వ తేదీన దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా నాన్చడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతి లేదని అదే రోజు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సభను ఎక్కడ నిర్వహించుకోవాలో వాళ్లే నిర్ణయిస్తారా? అని మండిపడ్డారు.