Bandi Sanjay Accuses KTR of Corruption: కేటీఆర్.. నంబర్ వన్ దొంగ
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:34 AM
కేటీఆర్ నంబర్ వన్ దొంగ, ఒకప్పుడు మడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని తిరిగిన వ్యక్తికి వేల కోట్లు ఎలా వచ్చాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు....
ఆయనకు వేల కోట్లు ఎలా వచ్చాయి?
హైడ్రా పేరిట కూల్చిన ఇళ్లన్నీ హిందువులవే
మేం వచ్చాక ఫాతిమా కాలేజీని కూల్చేస్తాం
గోపీనాథ్ మరణం.. ముమ్మాటికీ మిస్టరీనే
ఇదిగో ఫిర్యాదు.. విచారణ చేపట్టాలి
ఉప ఎన్నిక ప్రచారంలో బండి సంజయ్
హైదరాబాద్ సిటీ/బోరబండ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్ నంబర్ వన్ దొంగ, ఒకప్పుడు మడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని తిరిగిన వ్యక్తికి వేల కోట్లు ఎలా వచ్చాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని పేదలు.. పేదలుగానే మిగిలిపోయారని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు వచ్చాయని దుయ్యబట్టారు. పథకాలు, ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట శివాజీ విగ్రహం, రహ్మత్ నగర్ కూడలిలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయి.. కాంగ్రె్‌సకు అవకాశం ఇస్తే హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపుతోందన్నారు. హైడ్రా పేరుతో కూల్చిన ఇళ్లన్నీ హిందువులవేనని తెలిపారు. చెరువును కబ్జా చేసి కట్టిన ఫాతిమా కాలేజీకి జోలికి మాత్రం పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామని, అక్కడ పేదలకు ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఆ కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా మరో మంచి కాలేజీలో చేర్పిస్తామన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని, హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్టుగా ఈ పోరు జరగనుందని అన్నారు. సర్వేలన్నీ తారుమారయ్యాయని, వార్ వన్ సైడ్ లాగా ఈ ఎన్నికలో హిందువులే గెలవాలని ఆకాంక్షించారు. లక్ష ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు మసీదులు, దర్గాల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 80 శాతం మంది హిందువులంతా ఏకమై.... గడపగడపకూ తిరిగి బీజేపీకి ఓట్లేయించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే ఇళ్ల మధ్య ఖబరస్థాన్లు వెలుస్తాయని, పార్కులన్నీ ఈద్గాలు, దర్గాలుగా మారుతాయని చెప్పారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిన నీచులు కాంగ్రెసోళ్లని, బీజేపీని గెలిపిస్తే అయోధ్య నుంచి పూజారులను పిలిపించి పెద్దమ్మ గుడిని కట్టిస్తాన్నారు.
అమిత్ షాను పిలిపించి పూజలు చేయిస్తానని హామీ ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ మరణం ముమ్మాటికీ మిస్టరీనే అని, ఈ విషయమై నెల క్రితమే మాదాపూర్ పీఎ్‌సలో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఫిర్యాదు కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి పంపిస్తున్నానని, దమ్ముంటే విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న సునీతకు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. వరదలకు ఇళ్లు కొట్టుకుపోయినా, రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణించినా కేసీఆర్ బయటకు రావడం లేదని, అటువంటి వారికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ హిందువుల్లో రోషముంటే బీజేపీకి ఓటుబ్యాంకుగా మారాలని కోరారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం గెలిచినట్లేనని, హిందువుల బతుకులు బర్బాద్ అవుతాయని వ్యాఖ్యానించారు. తాను ప్రజలను రెచ్చగొట్టడం లేదని, వాస్తవాలు మాట్లాడుతున్నానని చెప్పారు. చార్మినార్ పై కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.