Bakkani Narasimhulu: బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:06 AM
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు నేతలు అభ్యంతరాలు చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు.
జలాలు సముద్రంలోకి వెళ్లకుండా ఆపేందుకే ప్రాజెక్టు
కేసీఆర్, జగన్ సీఎంలుగా ఉన్నప్పుడే నిర్ణయం: బక్కని
షాబాద్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు నేతలు అభ్యంతరాలు చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బనకచర్ల విషయంలో తెలంగాణ రాష్ర్టానికి ఎటువంటి నష్టం చేసే ఉద్దేశం ఏపీ సీఎం చంద్రబాబుకి లేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ కలిసి బనకచర్లపై హైదరాబాద్/ఢిల్లీ వేధికగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చర్చిద్దామని సూచించారు. వర్షపు నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా అడ్డుకునేందుకే మాజీ సీఎంలు కేసీఆర్, జగన్‌లు ఉన్నపుడు ప్రగతి భవన్‌లో బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషించి ఆ నీటితో రాయలసీమకు నీరందించి రతనాల సీమగా మార్చుతానన్నారని చెప్పారు. కానీ, బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల పైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరొకరిపై నిందలు వేయడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో ప్రజల కోసం టీడీపీ నిరంతరం పనిచేస్తుంది కానీ స్వార్థ రాజకీయాల కోసం కాదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ టీడీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.