Balaji Naik From Nalgonda District: అధిక వడ్డీ ఎర.. కోట్లలో అప్పులు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:49 AM
రెండు కోట్ల రూపాయలు ‘పెట్టుబడి’ తెస్తే ఏజెంట్లకు స్విఫ్ట్ కారు బహుమానం. రూ.కోటి తెస్తే లక్షల విలువైన బైక్ నజరానా. ఏజెంట్లకు 6 శాతం కమీషన్..
ఏజెంట్ల వ్యవస్థ.. కమిషన్లు.. నజరానాలు
2 కోట్లు సేకరిస్తే కారు.. కోటి తెస్తే బైక్
కొన్నాళ్ల పాటు ఠంచనుగా 10% వడ్డీ
వెయ్యి కోట్లు సేకరించినట్లు అంచనా!
నల్లగొండ జిల్లాకు చెందిన బాలాజీ దందా.. ఉన్నట్టుండి మాయం
బాధితుల ఆగ్రహం.. బాలాజీ ఇంటిపై దాడి
నల్లగొండ క్రైం/పీఏపల్లి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రెండు కోట్ల రూపాయలు ‘పెట్టుబడి’ తెస్తే ఏజెంట్లకు స్విఫ్ట్ కారు బహుమానం. రూ.కోటి తెస్తే లక్షల విలువైన బైక్ నజరానా. ఏజెంట్లకు 6 శాతం కమీషన్.. డబ్బు ఇచ్చిన వారికి 10 శాతం వడ్డీ! ఇలా ఓ ఘరానా మోసగాడు అధిక వడ్డీలు, ఏజెంట్లకు కమిషన్ల ఆశ చూపి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకుని పరారయ్యాడు. దాంతో మధ్యవర్తిగా ఉండి కోటి రూపాయలు అప్పులు ఇప్పించిన వ్యక్తి ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశాడు. మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల పంచాయతీ పరిధిలోని పలుగుతండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలుగుతండాకు చెందిన రమావత్ సరియా నాయక్ మధ్యవర్తిగా ఉండి తన బంధువు రమావత్ బాలాజీ నాయక్‌కు రూ.కోటి వరకు అప్పులు ఇప్పించాడు. దీనికి బాలాజీ నాయక్ నెల నెలా 10 శాతం వడ్డీ, సరియా నాయక్‌కు 6 శాతం కమీషన్ ఇస్తున్నాడు. అయితే మూడు నెలలుగా వడ్డీ ఇవ్వకపోగా, 15 రోజులుగా బాలాజీ ఫోన్‌లో కూడా దొరకడం లేదు. దీంతో ఒత్తిడికి లోనైన సరియా నాయక్ ఆదివారం రాత్రి మిర్యాలగూడలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరియా నాయక్ బంధువులు, బాధితులు300మంది బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి బయటకు తెచ్చి నిప్పుపెట్టారు. ఈ ఘటనలపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పెద్దఅడిశర్లపల్లి పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి బాలాజీనాయక్ అధిక వడ్డీల ఎర వేసి సుమారు వెయ్యి కోట్ల వరకు సేకరించినట్లు నాలుగు నెలల క్రితమే వెలుగులోకి వచ్చింది. దేవరకొండ ఏరియా పబ్లిక్ ఫ్రాడ్ అవేర్‌నెస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు జూన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.1,000 కోట్ల వరకు అక్రమంగా సమీకరించాడని పేర్కొన్నారు. కానీ, విచారణ ముందుకు సాగలేదు. ఈ లోపు కొందరు పంచాయితీ నిర్వహించి మూడు నెలల్లో ఎవరి డబ్బులు వారికివ్వాలని సూచించారని, దీంతో బాధితులెవరూ అధికారికంగా ఫిర్యాదులు చేయలేదని తెలుస్తోంది.
ఏజెంట్ల వ్యవస్థ...
పెద్దసంఖ్యలో ఏజెంట్లను నియమించుకున్న బాలాజీ నాయక్ పీఏ పల్లితో పాటు, చందంపేట, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, తిరుమలగిరి (సాగర్) ప్రాంతాల్లో గిరిజనులు, ఉద్యోగులు, అధికారుల నుంచి అప్పులు తీసుకున్నాడు. వారికి నెలకు 10 శాతం వడ్డీ, ఏజెంట్లకు 6 శాతం కమీషన్ ఠంచనుగా ఇచ్చేవాడని, అలా నమ్మకం కలిగించి రూ.1,000కోట్లు సేకరించాడని చెబుతున్నారు. ఏజెంట్లకు నజరానాలు భారీగా ఇచ్చేవాడని, రూ.2 కోట్ల వరకు పెట్టుబడి తెస్తే స్విఫ్ట్ కారు, రూ.కోటి తెస్తే లక్ష విలువైన బైక్ ఇచ్చేవాడని చెబుతున్నారు. స్వగ్రామంలో రూ.3 కోట్లతో ఇల్లు కట్టుకున్న బాలాజీ నాయక్.. ఇటీవల తన పుట్టిన రోజు పార్టీకి రూ.50 లక్షలు ఖర్చు చేశాడని తెలుస్తోంది.