Azaruddin Inducted: మంత్రివర్గంలోకి అజారుద్దీన్
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:11 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌కు కలిసివచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆయనను మంత్రి పదవి వరించింది....
రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎఫెక్ట్!
మైనారిటీ సంక్షేమం, మరో శాఖ అప్పగించే అవకాశం
మరో రెండు మంత్రి పదవులు డిసెంబర్లో భర్తీ!
ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్
6 నెలల్లో అసెంబ్లీ లేదా మండలి సభ్యత్వం తప్పనిసరి
సీఎంను కలిసిన పలు మైనారిటీ సంఘాల నేతలు
ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌కు కలిసివచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆయనను మంత్రి పదవి వరించింది. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొంటారు. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమంతోపాటుగా మరో శాఖను అప్పగించనున్నట్టు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ సీటు నుంచి గెలిస్తే మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ టికెట్ కోసం అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు. సర్వేల నివేదికలు ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అధిష్ఠానంతో చర్చలు జరిపి.. అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ చీఫ్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మంత్రివర్గంలో ఆమోదించి, గవర్నర్‌కు పంపారు. ఈ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఆ ఫైలు గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. దీనితో అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో స్థానం ఆలస్యమవుతూ వచ్చింది.
ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని మెజారిటీ ముస్లింలు కాంగ్రె్‌సకే మద్దతు పలికారు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటివరకు మైనార్టీలకు చోటు లభించకపోవడంతో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వారి ఓట్లపై ప్రభావం చూపే ఆస్కారముందన్న భావన వ్యక్తమైంది. ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో అజారుద్దీన్‌ను కాస్త ముందుగానే మంత్రి మండలిలోకి తీసుకోవాలని అధిష్ఠానం అనుమతితో సీఎం రేవంత్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గ ఓటరు కావడంతో.. ప్రమాణ స్వీకారం కోసం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, నిబంధనల ప్రకారం ప్రస్తుతం మంత్రివర్గంలో మరో ముగ్గురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. అజారుద్దీన్ మంత్రి అవుతుండటంతో.. మిగతా రెండు పదవులను డిసెంబర్‌లో భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఆరు నెలల్లో ఎమ్మెల్సీ అయితే చాలు!
చట్టసభల్లో దేనిలోనూ సభ్యత్వం లేకుండా నేరుగా మంత్రి అవుతున్న అజారుద్దీన్.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా శాసనసభ లేదా మండలిలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియమించాలని ఇప్పటికే ప్రతిపాదించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా వస్తే ఆయన ఎమ్మెల్సీ అవుతారు. ఒకవేళ ఆరు నెలల్లోపు తుది తీర్పు రాకున్నా, ప్రతికూలంగా వచ్చినా.. అజారుద్దీన్‌కు చట్టసభ సభ్యత్వం కోసం ప్రభుత్వం ఇతర మార్గాలను అనుసరించాల్సి వస్తుంది.
సీఎంను కలిసిన మైనార్టీ సంఘాల నేతలు
వివిధ మైనార్టీ సంఘాల నేతలు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మైనార్టీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మైనార్టీ నేతలతో జరిగిన ఈ సమావేశంలో అజారుద్దీన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.