Azaruddin Assumes Charge as Minister: మంత్రిని అవుతాననుకోలేదు.. సీఎంకు థ్యాంక్స్!
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:26 AM
మంత్రిగా అజారుద్దీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పది రోజుల క్రితం మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన.. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో...
మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మంత్రిగా అజారుద్దీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పది రోజుల క్రితం మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన.. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వరంగ సంస్థల మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు హాజరై ఆయన్ను ఆశీర్వదించారు. అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ‘క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా వెళ్దామని అనుకున్నా. కానీ రాజకీయాల్లో చేరాక జీవితం మలుపు తిరిగింది. మంత్రిని అవుతానని ఊహించలేదు. సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. అమ్మానాన్నల ఆశీర్వాదంతోనే ఈ ఉన్నత స్థానం సాధ్యమైంది. మైనార్టీల అభివృద్ధికి సంబంధించి చాలా ప్రణాళికలున్నాయి. అధికారులతో చర్చించాలి. మైనార్టీ వర్గాలు విద్యలో మరిం త మెరుగైన స్థానంలో ఉండాలన్నది నా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎం సలహాదారు షబ్బీర్ అలీ అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.