Azaaruddin to Take Oath: మంత్రిగా అజారుద్దీన్.. ప్రమాణం నేడే
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:10 AM
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం...
మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణం చేయించనున్న గవర్నర్
వివిధ కేసుల్లో నిందితుడైన అజర్‌కు మంత్రి పదవా?
కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్ట విరుద్ధం: కిషన్‌రెడ్డి
సీఈవోకు బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేశారు. అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం లేఖ రాసింది. దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడ్ ఏమైనా అడ్డు వస్తుందా? అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికల కోడ్ అడ్డురాదని వారు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్దమంటూ బీజేపీ నేతలు పాయల శంకర్, మర్రి శశిధర్‌రెడ్డి, కె.ఆంథోనిరెడ్డిలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమంటే ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఈ ఫిర్యాదును సుదర్శన్‌రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు. అయితే, ఈ ఫిర్యాదును ఈసీ డిస్మిస్ చేయడం లాంఛనమేనని, అజర్ ప్రమాణ స్వీకారం యథాతథంగా జరగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే అజర్‌కు మంత్రి పదవి: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతోందని, అక్కడ గెలవాలనే మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో తమ పరిస్థితి ఏమిటో వారికి అర్థమైందని, పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి కాంగ్రెస్ అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోందని ఎక్స్‌లో ఆరోపించారు. ఉప ఎన్నిక కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవడం, ఎన్నడూ లేనివిధంగా మంత్రులు హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయేలా చేస్తేనే.. 2023లో వారిచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలను అమలు చేయడం ప్రారంభిస్తుందని కేటీఆర్ అన్నారు.
అజర్‌కు మంత్రి పదవా?: కిషన్‌రెడ్డి
‘కాంగ్రెస్ నేత అజారుద్దీన్ వివిధ కేసుల్లో నిందితుడు. ఆయనకు ఏ ప్రాతిపదికన మంత్రి పదవి ఇస్తారు’ అని సీఎం రేవంత్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజర్‌ను ఇప్పుడు హడావుడిగా మంత్రిని చేయాలని నిర్ణయించారన్నారు. ‘22 నెలలుగా మంత్రివర్గంలో మైనారిటీ నేత ఒక్కరు కూడా లేరు. నిజంగా మైనారిటీల సంక్షేమంపై శ్రద్ధ ఉంటే అజర్‌కు ముందే అవకాశం ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వడం చట్ట విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారింది’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.