Governor Jishnu Dev Varma: ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ వ్యాధి
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:00 AM
దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం నానాటికి పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 10 మంది పెద్ద...
అవయవ దానంపై అవగాహన పెరగాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాయదుర్గం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం నానాటికి పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 10 మంది పెద్ద వారిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నట్లు తేలిందన్నారు. హైటెక్‌సిటీలో యశోద హాస్పటల్స్ ఆధ్వర్యంలో 36 నెలల్లో 300 మందికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. ఈ సందర్భంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారితోపాటు కిడ్నీ దాతలతో జరిగిన సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ప్రజల్లో అవయవ దానంపై మరింత అవగాహన పెరగాలని చెప్పారు. దీనికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. నేటి జీవన విధానంతో పలువురు యువకులు కూడా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చచేశారు. ప్రతి ఏటా సుమారు 6 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు.. డయాలసిస్ దశకు చేరుకుంటున్నారన్న గవర్నర్.. 300 మందికి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన యశోదా హాస్పిటల్స్ వైద్యులను అభినందించారు. యశోదా హాస్పిటల్స్ గ్రూపు ఎండీ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ దేశంలోని కిడ్నీ మార్పిడి ప్రముఖ కేంద్రాల్లో ఒకటిగా తమ సంస్థ అవతరించిందన్నారు. తమ ఆస్పత్రులన్నీ 3500కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తే.. హైటెక్ సిటీ యూనిట్ మూడేళ్లలో 300 శస్త్ర చికిత్సల మైలురాయిని చేరుకుందని చెప్పారు. ఆస్పత్రి సీనియర్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో 20 శాతానికంటే ఎక్కువ మందిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ప్రాబల్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, కిడ్నీ మార్పిడి గ్రహీతలు, కిడ్నీ దాతలు పాల్గొన్నారు.