Share News

Drunken Drive: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:02 AM

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన ఓ ఆటో డ్రైవర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని...

Drunken Drive: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

  • కుషాయిగూడ ట్రాఫిక్‌ పీఎస్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న వైనం

మల్కాజిగిరి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్‌ డ్రైవ్‌లో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన ఓ ఆటో డ్రైవర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని గాంధీ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... జవహర్‌నగర్‌ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి మీన్‌రెడ్డి(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జవహర్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తి వద్ద ఆటోను అద్దెకు తీసుకున్నాడు. మీన్‌రెడ్డి మంగళవారం రాత్రి ఆటోలో వస్తుండగా కాప్రా పరిధిలోని ఓ స్కూల్‌ వద్ద రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న మీన్‌రెడ్డి ఆటోను ఆపి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టు చేయగా మద్యం తాగినట్టు తేలడంతో ఆటోను ట్రాఫిక్‌ పీఎ్‌సకు తీసుకెళ్లారు. మీన్‌రెడ్డి మద్యం తాగి ఉండటంతో అతని తరఫున ఎవరినైనా తీసుకుని వస్తే వారికి ఆటో ఇస్తామని పోలీసులు తెలిపారు. మీన్‌రెడ్డి తన యజమానికి విషయం చెప్పగా నాలుగు రోజుల నుంచి ఆటో అద్దె డబ్బులు ఇవ్వకపోగా ఆటోను పోలీ్‌సస్టేషన్‌కు పట్టుకెళ్లడంపై గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో కొద్దిసేపటికే మళ్లీ కుషాయిగూడ ట్రాఫిక్‌ పీఎ్‌సకు వచ్చిన మీన్‌రెడ్డి తన వెంటతెచ్చుకున్న పెట్రోల్‌ను మీదపోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ట్రాఫిక్‌ పోలీసులకు తెలుపగా వారు మల్కాజిగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. తీవ్రంగా గాయపడ్డ మీన్‌రెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మరణించినట్టు తెలిపారు.

Updated Date - Nov 06 , 2025 | 02:03 AM