Share News

kumaram bheem asifabad- ఇక హాజరు పక్కా

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:17 PM

ఇకపై జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు కూడా సాంకేతికతతోనే నమోదు కానుంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆథారిత ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్‌)ద్వారా విద్యార్థుల హాజరును పక్కాగా అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ వినూత్న విధానం హాజరుతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

kumaram bheem asifabad- ఇక హాజరు పక్కా
బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- ఏఐ టెక్నాలజీ ఆధారంగా చర్యలు

- ఉత్తీర్ణతశాతం పెంచడమే ధ్యేయంగా ప్రణాళిక

బెజ్జూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఇకపై జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు కూడా సాంకేతికతతోనే నమోదు కానుంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆథారిత ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్‌)ద్వారా విద్యార్థుల హాజరును పక్కాగా అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ వినూత్న విధానం హాజరుతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అధికారులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే ఫేస్‌ రికగ్నిషన్‌ సొల్యూషన్‌ ద్వారా హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఇంటర్మీడియెట్‌ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల చివరి నాటికి కొత్త హాజరు విధానం అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇప్పటికే ప్రభుత్వం అధ్యాపకులకు బయోమెట్రిక్‌ విధానం ద్వారా అటెండెన్స్‌, సీసీ కెమెరాల నిఘా అమలులో ఉండగా, ఇప్పుడు విద్యార్థులకూ బయోమెట్రిక్‌ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 11ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదువేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

- వివరాలు యాప్‌లో..

ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన యంత్రాల కొనుగోలు, అమరిక పనులను ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. విద్యార్థులకు సంబంధించిన ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలను అప్లికేషన్‌ ద్వారా ఇంటర్మీడియెట్‌ వెబ్‌సైట్‌ లాగిన్‌లో సేకరిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా తరగతి గదిలో మొత్తం విద్యార్థులకు కలిపి ఒకే ఫొటో తీసినా అందరి హాజరు నమోదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ లెక్కన జిల్లాలో 11జూనియర్‌ కళాశాలల్లో సుమారు ఐవేల మంది విద్యార్థులకు ఈ విధానం వర్తిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగానే కళాశాలల్లో ఈ కొత్త హాజరు నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

- ప్రయోజనం కలిగే అవకాశం..

ఈ విధానంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, కళాశాల ఫీజులు పొందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి. దీంతో వాటి అమలులో పారదర్శకత పెరుగుతుంది. హాజరుశాతం పెరిగితే ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పక్కాగా అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కళాశాలల్లో అధ్యాపకులకు ఇదే విధానాన్ని అమలు చేయగా సత్ఫలితాలు రావడంతో ఇక విద్యార్థుల హాజరు నమోదును కూడా ఏఐ ద్వారా నమోదుకు శ్రీకారం చుడుతోంది. దీంతో అధ్యాపకులు ఏ విధంగానేతే విధులకు సక్రమంగా హాజరవుతున్నారో అలాగే విద్యార్థులు కూడా నిత్యం డుమ్మాలు కొట్టకుండా కళాశాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అధ్యాపకుల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నారో అదే విధంగా విద్యార్థులు కళాశాలకు వచ్చే అవకాశం ఉండటంతో పాటు పాఠాలు సరిగా బోధిస్తున్నారా లేదా అన్నదానిపై కూడా నిఘా ఏర్పాటు ఉండటంతో అటు అధ్యాపకులు, విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరు కావడంతో పాటు ఉత్తమ పలితాలు సాధించడానికి అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఈ నెల చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం జిల్లా నుంచి ఇటీవల ఇద్దరు అధ్యాపకులను ఎంపిక చేసి శిక్షణ కోసం హైదరాబాద్‌కు పింపించారు.

ఆదేశాలు రాగానే అమలు..

- కళ్యాణి, జిల్లా మాధ్యమిక విద్యాధికారి, ఆసిఫాబాద్‌

ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కార్యాచరణపై ఇటీవల చర్చించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఈ పద్ధతిని అమలు చేస్తాం. ఈ విధానం అమలుతో విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు ఉత్తమ ఫలితాల సాధనకు దోహదం చేస్తుంది.

Updated Date - Aug 28 , 2025 | 11:17 PM