Share News

ట్రాక్టర్‌తో తొక్కించి చంపే ప్రయత్నం

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:30 AM

చేబదులుగా ఇచ్చిన డబ్బుల విషయంలో అక్కాబావతో పాటు మేనకోడళ్లపై ట్రాక్టర్‌తో ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు.

ట్రాక్టర్‌తో తొక్కించి చంపే ప్రయత్నం
వరి కోత యంత్రాన్ని ట్రాక్టర్‌తో ఢీకొట్టి డ్రైవర్‌పై దాడి చేస్తున్న ఉపేందర్‌రెడ్డి

చేబదులు డబ్బులు తిరిగివ్వాలంటూ తమ్ముడి దౌర్జన్యం

సహకరించిన తల్లి ఫ ప్రతిదాడికి దిగిన సోదరి కుటుంబం

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఘటన

మునగాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : చేబదులుగా ఇచ్చిన డబ్బుల విషయంలో అక్కాబావతో పాటు మేనకోడళ్లపై ట్రాక్టర్‌తో ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఇందుకు తల్లి సహకరించింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడెంలో జరిగింది. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి కళావతి, సుధాకర్‌రెడ్డి దంపతులకు కుమార్తె, కుమారుడు. నాలుగేళ్ల కిందట సుధాకర్‌రెడ్డి మృతి చెందాడు. 25ఏళ్ల కిందట మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన రెబబోతు రాంరెడ్డితో వివామైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం జ్యోతి దంపతులు కోదాడలో ఉంటున్నారు. ఆమె పెళ్లి సమయంలో బరాఖత్‌గూడెంలో తమకు చెందిన కొంత భూమిని జ్యోతికి రాసివ్వగా, మరికొంత భూమిని జ్యోతి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ భూమిని సాగు కోసం జ్యోతి కౌలుకు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆమె తమ్ముడు దొంతరెడ్డి ఉపేందర్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరువూరులో బీఎ్‌సఎన్‌ఎల్‌లో జేఈగా ఉద్యోగం చేస్తున్నారు. జ్యోతి కుమార్తె పెళ్లికి కళావతి చేబదులుగా బంగారం, డబ్బు సాయం చేసింది. అయితే అవి తిరిగి ఇవ్వాలని రెండేళ్లుగా జ్యోతితో తల్లి కళావతి, తమ్ముడు ఉపేందర్‌రెడ్డి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట కోదాడలో పెద్దమనుషుల మధ్య జరిగిన పంచాయితీలో డబ్బులు తిరిగి ఇచ్చేలా అంగీకారం కుదిరింది. ఆ మేరకు జ్యోతి డబ్బులు తిరిగి ఇచ్చేంది.

ఇంకా నగదు ఇవ్వాలని వివాదం

ఒప్పందం మేరకు డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా రూ. 2లక్షల వరకు రావాలంటూ తల్లి కళావతి, తమ్ముడు ఉపేందర్‌రెడ్డి సోదరి జ్యోతిని వేధిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు ఇచ్చే వరకూ పొలంలో వరికోతలు కోయనివ్వమంటూ ఆదివారం కౌలు రైతును కళావతి, ఉపేందర్‌రెడ్డి కలిసి హెచ్చరించారు. ఈ విషయాన్ని కౌలు రైతు జ్యోతికి తెలియజేయడంతో ఆమె తన భర్త రాంరెడ్డి, కుమార్తెలతో కలిసి పొలం వద్దకు వచ్చింది. ఆ సమయంలో తల్లి కళావతి, ఉపేందర్‌రెడ్డి అక్కడ లేరు. దీంతో దగ్గరుండి యంత్రంతో వరి కోతలు కోయిస్తోంది. విషయం తెలుసుకున్న కళావతి, ఉపేందర్‌రెడ్డిలు ట్రాక్టర్‌పై పొలం వద్దకు వస్తూనే వరి కోత యంత్రాన్ని ఢీకొట్టారు. అనంతరం అడ్డుకోబోయిన జ్యోతి, రాంరెడ్డి, ఆమె కుమార్తెలపైకి ట్రాక్టర్‌ తీసుకెళ్తుండగా వారు పరుగులు తీశారు. ట్రాక్టర్‌ దిగిన ఇద్దరు వరి కోత యంత్రం డ్రైవర్‌పై దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన జ్యోతి, రాంరెడ్డి, వారి కుమార్తెలపై దాడి చేశారు. చుట్టుపక్కల రైతులు వచ్చి వారిని కాపాడారు. ప్రతిదాడిలో కళావతికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు జ్యోతి, రాంరెడ్డి, ఆమె కుమార్తెలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జ్యోతి ఫిర్యాదు మేరకు ఆమె తల్లి కళావతి, ఉపేందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 24 , 2025 | 12:30 AM