Share News

Acharya Haragopal: శాంతి చర్చలు కోరుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయం

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:18 AM

శాంతి చర్చలు కావాలని అడుగుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయమని ఆచార్య హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Acharya Haragopal: శాంతి చర్చలు కోరుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయం

  • పౌర సమాజం గళమెత్తాలి: ఆచార్య హరగోపాల్‌

  • వంద రోజులైనా కాల్పుల విరమణ ప్రకటించాలి :చర్చల కమిటీ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): శాంతి చర్చలు కావాలని అడుగుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయమని ఆచార్య హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా జరుగుతున్న ఈ దుశ్చర్యపై పౌర సమాజం గళమెత్తాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌, సోమాజీగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. రాజ్యం హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు పౌర సమాజం తప్పనిసరిగా గళమెత్తాలని పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అమానవీయం అన్నారు. శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని కోరారు. మావోయిస్టు నాయకులంతా ఓ చోట సమావేశమై సమష్ఠి నిర్ణయం తీసుకునేందుకు కనీసం వంద రోజులైనా కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇక, స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ పేరుతో విడుదలైన లేఖ వాస్తవమా కాదా అనే విషయాన్ని పక్కనపెట్టి, కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని అభిప్రాయపడ్డారు. విశ్రాంత ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌ అధ్యక్షత జరిగిన సమావేశంలో చలపతిరావు, బి.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 07:20 AM