Share News

Attack Attempt on CJI: రాజ్యాంగం, దళిత సమాజంపై దాడి

ABN , Publish Date - Oct 07 , 2025 | 03:00 AM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఎంపీ మల్లు రవి ఖండించారు. ఇది ముమ్మాటికీ భారత రాజ్యాంగం, దళిత సమాజంపై జరిగిన దాడి...

Attack Attempt on CJI: రాజ్యాంగం, దళిత సమాజంపై దాడి

  • సీజేఐపై దాడి యత్నాన్ని ఖండించిన ఎంపీ మల్లు రవి, సీతక్క, కూనంనేని, జాన్‌ వెస్లీ

  • అది రాజ్యాంగ పరిరక్షణ పునాదులపై దాడి: మహేశ్‌గౌడ్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఎంపీ మల్లు రవి ఖండించారు. ఇది ముమ్మాటికీ భారత రాజ్యాంగం, దళిత సమాజంపై జరిగిన దాడి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో సీజేఐ స్థాయికి ఎదిగిన రెండో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జస్టిస్‌ గవాయ్‌ అని గుర్తు చేశారు. ఆయన ప్రతిభ, మేధస్సుతో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. ఈ దాడి యత్నం ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని విశ్వసించే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ ఘటనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీజేఐపై దాడి యత్నం దేశ న్యాయవ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ పునాదులపైన జరిగిన దాడి అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ గవాయ్‌పై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ గవాయ్‌పై దాడికి యత్నించడం అత్యంత దిగ్ర్భాంతికరమని, ఇది హేయమైన చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సనాతన ధర్మం పేరుతో ఏకంగా ప్రధాన న్యాయమూర్తి మీదనే బూటు విసిరే ప్రయత్నం బెదిరింపు ధోరణి, అరాచకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సీజేఐపై దాడి యత్నం ఘటనపై స్పందించాలని సీపీఐ అగ్రనేత నారాయణ డిమాండ్‌ చేశారు. దాడి యత్నాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, బాధ్యుడిని కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 03:00 AM