kumaram bheem asifabad- క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలి
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:01 PM
క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన భీమన్న క్రీడామైదనంలో శనివారం 71వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
రెబ్బెన, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన భీమన్న క్రీడామైదనంలో శనివారం 71వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన భీమన్న క్రీడామైదానంలో అంతర్ జిల్లాల బాల్‌బ్మాడింటన్ టోర్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అతి చిన్న గ్రామంలో భారీ స్థాయిలో పోటీలు నిర్వహించడం రాష్ట్రానికే హర్షణీయమన్నారు. రెబ్బెన నుంచి జాతీయ స్థాయిలో 300 మంది క్రీడాకారులు ఆడినట్లు చెప్పారు. ఇందులో నలుగురు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో క్రీడాకారులకు తన వంతు సహాయం చేస్తామని ప్రకటించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడిన వారు గెలిచేందుకు మళ్లీ ప్రయత్నించాలన్నారు. ఈ ప్రాంతంలో క్రీడాకారులను అభివృద్ధి పరుస్తున్న ద్రోణాచార్యులు ఆర్ నారాయణరెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి, షార్ప్ స్టార్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. బెల్లంపల్లి జీఎం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని చక్కటి ప్రతిభ కనబరిచి సింగరేణితో పాటు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుక రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఎంమాధవి, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, రాజన్న, ఎ.రవీందర్ గౌడ్, ఎం.వెంకటేశ్వర్లు, బయ్యన్న, మాదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.