Share News

Assembly Debate Turns Fierce: మాట.. మర్యాద!

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:13 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు.. తమ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగిస్తున్న భాషపై సోమవారం శాసనసభలో వాడీవేడిగా చర్చ జరిగింది...

Assembly Debate Turns Fierce: మాట.. మర్యాద!

  • నేతలు పరస్పరం దిగజారి మాట్లాడుతున్నారు

  • విమర్శల్లో వాడుతున్న భాష అభ్యంతరకరం

  • అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

  • మేం మర్యాదపూర్వకంగా నడుచుకుంటున్నాం

  • బీఆర్‌ఎస్‌ కూడా మారాలి: మంత్రి శ్రీధర్‌బాబు

  • ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: హరీశ్‌

  • ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలి

  • జాబ్‌ క్యాలెండర్‌, రాజీవ్‌ యువశక్తిపై స్పష్టత ఇవ్వాలి.. జీరో అవర్‌లో ప్రస్తావన

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు.. తమ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగిస్తున్న భాషపై సోమవారం శాసనసభలో వాడీవేడిగా చర్చ జరిగింది. చట్టసభలో, బయట నేతలు పరస్పరం ఏకవచనంతో సంబోధిస్తూ.. మర్యాదలేని భాషలో విమర్శలు చేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జీరో అవర్‌ సందర్భంగా గౌరవ మర్యాదలు, సభా సంప్రదాయాలను ఆయన ప్రస్తావించారు. ఎవరైనా సరే ఎదుటివారిని గౌరవిస్తూ.. విమర్శలు, ప్రతివిమర్శలు చే యాలని, దిగజారుడు భాషలో మాట్లడటం సరికాదని అన్నారు. ‘‘శాసనసభకు కొత్తగా వచ్చిన సభ్యులు 57 మంది ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బూతులు మాట్లాడటమే రాజకీయ లక్షణం అనుకుంటే.. అది అవలక్షణమని గుర్తించాలి. కేసీఆర్‌ నుంచి రేవంత్‌రెడ్డి దాకా, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజానికి మంచి సందేశాన్నివ్వాలి’’ అని వెంకటరమణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నగరం వరల్డ్‌ క్లాస్‌ అంటున్నారని, మాటలు మాత్రం థర్డ్‌ క్లాస్‌లా ఉంటున్నాయని పేర్కొన్నారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. అభ్యంతరకర భాషలో ఎవరు మాట్లాడినా త ప్పేనని, సభలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని అన్నారు. సభ హుందాతనాన్ని కాపాడే ప్రయత్నంలో తాము చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. వారు (బీఆర్‌ఎస్‌) కూడా మారాలని, వారి నాయకులను సరైన దారిలో పెట్టాలని సూచించారు. దీంతో హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ సభ్యులు కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలి..

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలన్నారు. టీచర్లు తాము బోధిస్తున్న సబ్జెక్టులో కాకుండా.. ఇతర సబ్జెక్టుల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనే నిబంధన పెట్టారని తెలిపారు. సంబంధం లేని సబ్జెక్టుల్లో పరీక్షలు రాసి.. ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగాల నుంచి తీసేయాలనే నిబంధన విధించ డం సరికాదన్నారు. కాగా, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం 90 శాతం దాకా పూర్తయిందని, మిగిలిన 10 శాతాన్ని వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. లేదంటే ఇప్పటిదాకా వెచ్చించిన రూ.1600 కోట్లు వృధాగా పోతాయన్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. తన నియోజకవర్గమంతా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఉందని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే.. అటవీ శాఖ అధికారులు కట్టుకోనివ్వడం లేదని తెలిపారు. రైతులు పండించిన పంటను తరలించేందుకు సీసీ రోడ్లు వేయనివ్వడం లేదన్నారు. దీంతో అటవీ శాఖతో రోజూ కొట్లాడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. కాగా, సింగరేణిలో బొగ్గు తీసిన తర్వాత మిగిలే ఓపెన్‌కాస్టులను గీత కార్మికులకు ఇవ్వాలని, వాటిలో ఈత, తాటి వనాలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్‌ ఠాకూర్‌ కోరారు. 50 ఏళ్లు నిండిన విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు.

తిరుమలలో తెలంగాణ భవనాలు కట్టాలి..

రాష్ట్ర విభజన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ నుంచి వెళ్లే భక్తులకు దర్శనం, వసతి సౌకర్యానికి ఇబ్బందులు వస్తున్నాయని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఐదెకరాల స్థలాన్ని ఇవ్వడానికి ఆ రాష ్ట్రప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. తక్షణమే శబరిమలతోపాటు తిరుమలలో వసతి గృహం కట్టించాలని కోరారు. కాగా, భీమ్‌గ ల్‌లో వంద పడకల ఆస్పతి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బిల్లులు పెడింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్‌ పని చేయడం లేదని, పెండింగ్‌లో ఉన్న 20 శాతం పనులను పూర్తిచేయాలని అన్నారు. దాంతోపాటు భీమ్‌గల్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. యూరియా కోసం యాప్‌ ఏర్పాటు వద్దన్నారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ల కింద కాలువల్లో పూడిక తీయించాలని కోరారు. కాగా, హైదరాబాద్‌లో చెత్త సమస్య తీవ్రంగా ఉందని యాకుత్‌పుర ఎమ్మెల్యే మెరాజ్‌ హుస్సేన్‌ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కానున్నందున ముందుగానే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.


సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాల సమస్యను పరిష్కరించాలి..

కోల్‌బెల్ట్‌లో గనులన్నీ సింగరేణికి దక్కేలా చూడాలని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. డిపెండెంట్‌ ఉద్యోగాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, మారుపేర్లతో నియమితులైన వారి సమస్యను పరిష్కరించాలని, సొంత ఇంటి కోసం సాయం అందించాలని అన్నారు. జెన్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.43 వేల కోట్లను ఇప్పించాలన్నారు. కాగా, ఆలేరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, చేర్యాల(జనగామ)ను రెవెన్యూ డివిజన్‌ చేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.

మేడిగడ్డను కూల్చినట్లే చెక్‌డ్యామ్‌ను కూల్చుతున్నారు: కౌశిక్‌రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని జిలెటిన్‌ స్టిక్కులు పెట్టి కూల్చేశారని హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని కల్వల ప్రాజెక్టును పూర్తిచేస్తే ఆరేడు వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని, నియోజకవర్గంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మించిన చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చేశారని అన్నారు. మేడిగ్డడను బాంబు పెట్టి పేల్చివేసినట్లే.. తనుగుల చె క్‌డ్యామ్‌ను కూడా కూలగొట్టారని వ్యాఖ్యానించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు నిరసన తెలపడంతో ఇరుపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

జీరో అవర్‌ అరణ్య రోదనగా మారింది: హరీశ్‌రావు

అసెంబ్లీలో జీరో అవర్‌ అరణ్య రోదనగా మారుతోందని బీఆర్‌ఎస్‌ సభ్యుడు హరీశ్‌రావు అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు పంపించేదని తెలిపారు. ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని, పీఆర్‌సీ, ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ అనంతరం వారు దాచుకున్న నగదు అందక రాష్ట్రంలో 39 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు మరణించారని తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం పాత పింఛను పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసు శాఖలో సరెండర్‌ లీవులు, టీఏ, డీఏలు కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో లక్ష మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. హరీశ్‌రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. గత పాలకులు ఉద్యోగులకు 20వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేస్తామని చెప్పారు.


ఫాలింగ్‌లో అసెంబ్లీ పని దినాలు: హరీశ్‌

తెలంగాణ రైజింగ్‌ అంటూ బోర్డులు పెట్టుకొని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీ పనిదినాల విషయంలో మాత్రం ఫాలింగ్‌లో ఉందని హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. రెండేళ్లలో ఆరు రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు పెట్టారని, ఈ ఏడాది 15 రోజులు మాత్రమే సభ నడిపారని తెలిపారు. ప్రస్తుత సమావేశాలు 15 రోజులు నడపాలని స్పీకర్‌ను కోరితే.. వారం రోజులు జరుపుతామన్నారని చెప్పారు. కోర్టుల్లో కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టు ద్రోహం చేసింది కాంగ్రెస్‌ వాళ్లేనని ఆరోపించారు.

గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి..

గల్ఫ్‌ కార్మికులు సుమారు పది లక్షల మంది ఉన్నారని, వారి కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందిస్తూ.. ఇప్పటికే గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, వారికి సహాయం చేసేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, మైనింగ్‌ పాలసీలో మార్పులు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరారు. తాండూరులో మాత్రమే లభ్యమయ్యే రాళ్లకు మార్కెట్‌ కల్పించి.. కార్మికులకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూడాలన్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించేలా 50 పడకలు, 30 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, నాలాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని బితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. జాబ్‌ క్యాలెండర్‌, రాజీవ్‌ యువశక్తిపై స్పష్టత ఇవ్వాలని, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 06:13 AM