Irrigation Department: హైదరాబాద్ సీఈగా ఏఎస్ఎన్‌రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:25 AM
నీటిపారుదల శాఖలో రెండు బాధ్యతలు చూస్తున్న ఒక చీఫ్ ఇంజనీర్(సీఈ) పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను ఇద్దరు సీఈలకు అప్పగిస్తూ...
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : నీటిపారుదల శాఖలో రెండు బాధ్యతలు చూస్తున్న ఒక చీఫ్ ఇంజనీర్(సీఈ) పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను ఇద్దరు సీఈలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్(సీఈ)గా పనిచేస్తున్న ఎ.సత్యనారాయణరెడ్డికి హైదరాబాద్ సీఈగా, వరంగల్ సీఈగా పనిచేస్తున్న ఆర్.సుధీర్‌కు కొత్తగూడెం సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఈమేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. కొత్తగూడెం సీఈగా పనిచేస్తూ... హైదరాబాద్ సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎ.శ్రీనివా్‌సరెడ్డి మంగళవారం పదవీ విరమణ చేయడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కాగా ఈయన సర్వీసు కాలాన్ని పొడిగించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక మంత్రికి అత్యంత ఆప్తుడిగా ఆయనకు పేరుంది. కీలక దశలో ఉన్న ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆయన లేకుంటే.. దాని పనులు ఆగిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళనతో ఉంది. దాంతో శ్రీనివా్‌సరెడ్డి పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈఫైలు బుధవారం ఆర్థిక శాఖకు చేరగా.. ఆ శాఖ ఆమోదం అనంతరం సీఎం కార్యాలయం కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. దాంతో ఈలోగా ఇతరులకు తాత్కాలికంగా బాధ్యతలు కట్టబెట్టారు. ఇక గజ్వేల్ పరిధిలోని దౌలతాబాద్ డీఈఈగా పనిచేస్తున్న కె.బాలకృష్ణ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.