Minister Jupally: సామాజిక రుగ్మతలపై ప్రభాతభేరి
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:47 AM
కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సామాజిక రుగ్మతలపై ప్రభాత భేరి మోగించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు...
సృజనకు పదును పెడితేనే సమాజం జాగృతం
కవులు, కళాకారులకు మంత్రి జూపల్లి పిలుపు
హైదరాబాద్, రవీంద్రభారతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సామాజిక రుగ్మతలపై ప్రభాత భేరి మోగించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సందేశాత్మక రచనలు, ఆట-పాటలతో సమాజం జాగృతమవుతుందని అన్నారు. సమాజంలో రుగ్మతలకు విరుగుడుగా సాహిత్యం, కళారూపాల ద్వారా చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఆదివారం రవీంద్ర భారతిలో భాషా, సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారఽథి ఆధ్వర్యంలో నిర్వహించిన ’ప్రభాతభేరి-తెలంగాణ సామాజిక చైతన్య’ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆనాటి సాంఘిక దురాచారాల మాదిరిగానే, నేటి ఆధునిక పోకడల మాటున కొత్త సామాజిక రుగ్మతలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మానవతా విలువలు లోపించడం, ఆస్తి తగాదాలు, ఈర్ష్య ద్వేషాల కారణంగా కుటుంబ సభ్యులనే అంతమొందిస్తుండడంతో కుటుంబ వ్యవస్థ విచ్ఛినమవుతోందని అన్నారు. పెళ్లి-పేరంటాలకు అనవసరపు ఖర్చులు, కార్పొరేట్ విద్య-వైద్యంతో ఆర్థిక భారం, సెల్‌ఫోన్లకు బానిసలు కావడం, సోషల్ మీడియాలో మునిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం, మాదక ద్రవ్యాలు, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసలై ఆర్థికంగా నష్టపోవడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి ఆధునిక సమాజానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పర్చిన ఘనత సాహితీవేత్తలు, కవులు, కళాకారులదేనని, వారంతా సమాజహితానికి కొత్త దారులు దారి చూపేలా తమ సృజనకు పదునుపెట్టాలని సూచించారు. సమాజంలో మార్పు కోసం, గతి తప్పిన జీవన విధానాన్ని గాడిన పెట్టేందుకు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు చైతన్యాన్ని, సరైన మార్గదర్శకత్వాన్ని, దశ దిశను చూపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వినూత్న రచనలతో, విభిన్నమైన ప్రదర్శనలతో ఇలాంటి సామాజిక రుగ్మతలపై ఒక కొత్త పోరాటం ప్రారంభించాలని, ప్రభాతభేరి మోగించి ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సాంస్కృతిక సారఽథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల, ప్రముఖ దర్శకులు నర్సింగరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రజా కవి జయరాజ్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, సాహిత్య అకాడమీ సంచాలకుడు నమోజు బాలాచారి పాల్గొన్నారు.