Artificial Beach: హైదరాబాద్‌లో బీచ్!
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:08 AM
హైదరాబాద్ నగరవాసులు సేదతీరేందుకు ఇకపై సముద్ర తీరాల దాకా వెళ్లాల్సిన పనిలేదు. అచ్చం అలాంటి అనుభూతి అందించేలా ఇక్కడే కృత్రిమ బీచ్ అందుబాటులోకి రానుంది...
235 కోట్లతో కొత్వాల్‌గూడలో 35 ఎకరాల్లో ఏర్పాటు
దుబాయ్, సింగపూర్ తరహాలో టన్నెల్ అక్వేరియం
ఫ్లయింగ్ థియేటర్, వికారాబాద్‌లో క్యారవాన్ పార్కు
నేడు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకోనున్న సంస్థలు
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరవాసులు సేదతీరేందుకు ఇకపై సముద్ర తీరాల దాకా వెళ్లాల్సిన పనిలేదు. అచ్చం అలాంటి అనుభూతి అందించేలా ఇక్కడే కృత్రిమ బీచ్ అందుబాటులోకి రానుంది. దానితోపాటు వినూత్న అనుభూతిని అందించే ఫ్లయింగ్ థియేటర్, టన్నెల్ అక్వేరియం, దేశ విదేశాల సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచే కల్చరల్ సెంటర్, పర్యాటకానికి ఊతమిచ్చేలా వికారాబాద్‌లో క్యారవాన్ పార్కు.. వంటి ఎన్నెన్నో సరికొత్త ప్రాజక్టులు వస్తున్నాయి. గ్లోబల్ సదస్సులో భాగంగా ఆయా సంస్థలు మంగళవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. ‘‘కొత్వాల్‌గూడలో 35 ఎకరాల్లో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ సాధారణ ప్రజలు బీచ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. అదే సమయంలో డిస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇందుకోసం స్పెయిన్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటున్నాం. ఇది 235 కోట్ల ప్రాజెక్టు. సాధారణ ప్రజలకోసం 200 వరకు చార్జీ ఉంటుంది. బీచ్‌లో స్నానంతోపాటు బోటింగ్ అనుభూతి కూడా పొందవచ్చు’’ అని ఈ ప్రాజెక్టులో భాగస్వామి హరి దామెర తెలిపారు.
టన్నెల్ అక్వేరియం.. క్యారవాన్ పార్కు
దుబాయ్, సింగపూర్‌లలో ఉన్న తరహాలో రూ.300 కోట్ల పెట్టుబడితో టన్నెల్ అక్వేరియం ఏర్పాటు చేయనున్నారు. నీటి అడుగున నడుస్తూ జలచరాలను చూస్తున్న అనుభూతిని దీనితో పొందవచ్చు. ఈ టన్నెల్ అక్వేరియంను కెడార్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కానుంది. ఇతర దేశాల్లో మాదిరిగా అన్ని రంగాల వారికి అవసరమైన సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్‌లో క్యారవాన్ పార్కు ఏర్పాటుకానుంది. క్యారవాన్‌లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి పార్కింగ్, దానిపక్కనే బస, వాహనం చార్జింగ్, వ్యూటవర్, 24 గంటల పాటు ఆహారం వంటివి ఈ క్యారవాన్ పార్కులో అందబాటులో ఉంటాయి. ప్రేక్షకులు ప్రత్యేకంగా రూపొందించిన కుర్చీలో కూర్చుని సినిమా చూస్తూ స్వయంగా అక్కడే ఉన్న అనుభూతిని పొందేలా ఫ్లయింగ్ థియేటర్‌ను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పర్యాటక రంగంలో ఉపాధి పొందేందుకు శిక్షణ, అవగాహన కల్పించే ‘స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ అండ్ ప్రాజెక్ట్స్(స్టె్‌ప)’ను స్థాపించనున్నారు. ఉదాహరణకు రాజులు, రాణుల తరహాలో ప్రత్యేకంగా దుస్తులు తయారు చేసి చారిత్రక కోటల వద్ద సిద్ధంగా ఉంచితే, సందర్శకులు కొంత అద్దె చెల్లించి ఆ దుస్తుల్ని ధరించి అనుభూతి పొందవచ్చు. ‘స్టెప్’ను ఔత్సాహిక పారిశ్రామికవేత్త లాస్య ఏర్పాటు చేయనున్నారు.