Tummala Nageswara Rao: ఒకేసారి 3 వ్యవసాయ కళాశాలలు!
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:33 AM
వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి ఒకేసారి మూడు వ్యవసాయ కళాశాలలను మంజూరు చేయటం చరిత్రలో ఇదే మొదటిసారని రాష్ట్ర వ్యవసాయశాఖ..
మంజూరు చేయడం చరిత్రలో మొదటిసారి
ప్రతి కళాశాలకు 24కోట్ల చొప్పున నిధులు
సీఎం, కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు: తుమ్మల
ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు ఖరారు
హైదరాబాద్/కొత్తగూడెం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి ఒకేసారి మూడు వ్యవసాయ కళాశాలలను మంజూరు చేయటం చరిత్రలో ఇదే మొదటిసారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల మంజూరుతో పాటు అవసరమైన నిధులు, సిబ్బంది నియామకంపై ఏకకాలంలో ఆమోదం తెలపటంపై తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మరో మూడు కళాశాలలు చేరినట్లు తెలిపారు. ఇప్పటివరకు వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ పాటు వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభించేందుకు కేబినేట్ పచ్చజెండా ఊపినట్లు తుమ్మల వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం మగ్దూనగర్‌లో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 65 ఎకరాల విస్తీర్ణంలో మరో వ్యవసాయ కళాశాలను స్థాపిస్తున్నట్లు తెలిపారు. మూడో కళాశాలను నిజామాబాద్ జిల్లాలో ఏర్పా టు చేస్తున్నట్లు తుమ్మల వెల్లడించారు. ప్రతి వ్యవసాయ కళాశాలకు సుమారు రూ.124 కోట్ల చొప్పున నిధులతోపాటు బోధన, బోధనేతర సిబ్బందిని మంజూరుచేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్లు తుమ్మల వెల్లడించారు. కాగా, దేశంలోనే మొట్టమొదటిదైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరు ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సుమారు 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ వర్సిటీకి సంబంధించి ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. తాజాగా మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేయడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు మొదలు నుంచి మంత్రి తుమ్మల కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాకు విశ్వవిద్యాలయం దక్కడంతో తన కల సాకారమైందన్నారు. ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ విద్యా రంగానికి కొత్త దిశను చూపుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులకు మంచి విద్యావకాశాలు లభిస్తాయస్తాయన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పర్యావరణ భూగర్భశాస్త్రం వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ వనరుల పరిశోధనకు, దేశ సుస్థిర అభివృద్ధికి ఇది ప్రధాన కేంద్రమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.