Deputy Chief Minister Bhatti Vikramarka: ఐపీఎస్ పూరన్ ఆత్మహత్యకు బాధ్యులను అరెస్టు చేయాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:58 AM
తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య అత్యంత దారుణమని.. తనను తీవ్రంగా బాధించిందని డిప్యూటీ సీఎం...
డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను ఇంకా కొనసాగించడం సిగ్గుచేటు
పూరన్ కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి పరామర్శ
ఫోన్‌లో సీఎం రేవంత్ ఓదార్పు
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య అత్యంత దారుణమని.. తనను తీవ్రంగా బాధించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సూసైడ్ నోట్‌లో బాధ్యులెవరో పేర్కొన్నప్పటికీ నిందితులపై చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. పూరన్ ఆత్మహత్యకు కారణమైన శత్రుజీత్ కపూర్‌ను డీజీపీగా కొనసాగించడం సిగ్గుచేటని విమర్శించారు. సోమవారం చండీగఢ్‌కు వెళ్లి పూరన్ కుటుంబ సభ్యులను భట్టి పరామర్శించారు. పూరన్ భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్‌ను సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. సీఎం కూడా వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు. పూరన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్, భట్టి భరోసానిచ్చారు. అనంతరం భట్టి అక్కడి మీడియాతో మాట్లాడారు. హరియాణా అదనపు డీజీగా పని చేసిన పూరన్.. అత్యంత ప్రతిష్ఠాత్మక ‘రా’ విభాగంలో కూడా సేవలందించారని తెలిపారు. ఉత్తమ సేవలకు రాష్ట్రపతి పతకాలను అందుకున్న ప్రతిభావంతుడని, అలాంటి గొప్ప అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. హరియాణా, కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఇకనైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తమ రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. ఓ ఐపీఎస్ అధికారికే రక్షణ లేకపోతే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తన ఆత్మహత్యకు డీజీపీ శత్రుజీత్ కపూర్, ఎస్పీ నరేంద్ర బిజర్నియా వేధింపులే కారణమని మరణ వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారని, అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నేటికీ శవపరీక్ష నిర్వహించలేదని, కనీసం.. తల్లికి, భార్యాపిల్లలకు పూరన్ మృతదేహాన్ని చూపించట్లేదని, ఇది అత్యంత అమానుషమని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనన్నారు. పూరన్ మరణం ఆయన కుటుంబానికే కాదని, వ్యవస్థకే తీరని లోటని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పూరన్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.