kumaram bheem asifabad- ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:18 PM
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పౌర సరఫరాలు, వ్యవసాయ, రవాణా, ఎఫ్‌సీఐ శాఖ కమిషనర్లతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రవాణా, పోలీసు శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమవేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పౌర సరఫరాలు, వ్యవసాయ, రవాణా, ఎఫ్‌సీఐ శాఖ కమిషనర్లతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రవాణా, పోలీసు శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్‌లో 44 వేల మెట్రిక్ టన్నుల వరి దాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో 22, పీఏసీఎస్ ద్వారా 18 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 24 నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,369 ధర నిర్ణయించారని అన్నారు. సన్న రకంకు రూ.500 బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, వ్యవసాయాధికారి వెంకటి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, పౌరసరఫరాల శాఖాధికారి స్వామి, సాదిక్, తదితరులు పాల్గొన్నారు.