Bhupalpally: సైన్యంలో చేరలేననే మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:26 AM
సైన్యంలో చేరాలనే తన కలను నెరవేర్చుకునేందుకు శిక్షణ కోసం ఓ అకాడమీకి వెళ్లిన బాలుడు.. అక్కడ పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దాంతో ఇక, తన కల నెరవేరదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
భూపాలపల్లి జిల్లాలో ఘటన
మహాముత్తారం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సైన్యంలో చేరాలనే తన కలను నెరవేర్చుకునేందుకు శిక్షణ కోసం ఓ అకాడమీకి వెళ్లిన బాలుడు.. అక్కడ పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దాంతో ఇక, తన కల నెరవేరదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో జరిగిన ఈ ఘటనలో మంతెన రంజిత్(15) మరణించాడు. మంతెన రాజబాబు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పదో తరగతి పాసైన రాజబాబు పెద్ద కుమారుడు రంజిత్.. సైన్యంలో ఉద్యోగం చేయాలనే కోరికతో శిక్షణ కోసం కరీంనగర్‌లోని ఓ అకాడమీకి వెళ్లాడు. అక్కడ పరీక్షల్లో రంజిత్ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో తీవ్ర నిరాశతో సోమవారం పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలో చనిపోయాడు. తండ్రి రాజబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.