Armed Robbery on Cinefakku Road: సినీఫక్కీలో దారిదోపిడీ.. 40 లక్షలు చోరీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:38 AM
పట్టపగలు.. నలుగురు దుండగులు సినీఫక్కీలో దారి దోపిడీకి పాల్పడి రూ.40 లక్షలు దోచుకున్నారు! అనంతరం అక్కణ్నుంచీ పారిపోయే...
ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి కారుతో ఢీకొట్టిన దుండగులు
లోపలున్నవారిపై కారం చల్లి.. డమ్మీ పిస్తోలు, కత్తులతో బెదిరించి దోపిడీ
పారిపోయే క్రమంలో బోల్తాపడ్డ వారి కారు.. లోపలున్న నలుగురూ పరార్
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో ఘటన
శంకర్‌పల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పట్టపగలు.. నలుగురు దుండగులు సినీఫక్కీలో దారి దోపిడీకి పాల్పడి రూ.40 లక్షలు దోచుకున్నారు! అనంతరం అక్కణ్నుంచీ పారిపోయే క్రమంలో వారి కారు బోల్తాపడింది. లోపలున్న నలుగురు దుండగులూ పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన రాకేశ్ అగర్వాల్ స్టీల్ వ్యాపారి. వికారాబాద్‌లో ఉన్న తన కస్టమర్ వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకురావాలం టూ.. ఆయన తన డ్రైవర్ మధును, నమ్మకస్తుడైన సాయిబాబా అనే మరో వ్యక్తిని శుక్రవారం ఉదయం కారులో పంపించాడు. వారిద్దరూ వికారాబాద్‌లో కస్టమర్ ఇచ్చిన సొమ్ముతో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే.. నలుగురు దుండగులు మరో కారులో (టీఎస్ 11 ఈఎల్ 8817) వారిని వెంబడించారు. మధ్యాహ్నం 1:30గంటల సమయం లో శంకర్‌పల్లి మండల పరిధిలోని హుస్సేన్‌పూర్ గ్రామ శివారులోకి రాగానే.. మధు, సాయిబాబా ఉన్న కారు ను వెనుక నుంచి ఢీకొట్టారు. వారి కారు ఆగగానే.. ముగ్గురు వ్యక్తులు ముఖాలకు మాస్క్ ధరించి వచ్చి డ్రైవర్ మధు కళ్లలో కారం చల్లి, వెనుక వైపు కారు అద్దం పగలగొట్టి.. లోపల కూర్చున్న సాయిబాబాపై దాడి చేశారు. డమ్మీ పిస్తోల్‌తో బెదిరించి అతడి వద్ద ఉన్న రూ.40 లక్షల నగదు సంచిని లాక్కుని తమ కారులో అక్కణ్నుంచి వెళ్లిపోయారు. కానీ.. నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కొత్తపల్లి గ్రామంలోకి రాగానే దుండగుల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తాపడింది. వెంటనే దుండగులు కారులో నుంచి బయటకు వచ్చి.. కారును అక్కడే వదిలి రూ.40 లక్షల డబ్బు ఉన్న బ్యాగ్ తీసుకొని అక్కణ్నుంచీ వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కారు బోల్తాపడిన శబ్దం విని అక్కడికి చేరుకున్న స్థానికులు ఏమైందని అడగ్గా.. తమపై ఎవరో దాడి చేసేందుకు వెంటపడుతున్నారని చెబుతూ అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. వారి తీరుతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని కారును పరిశీలించగా.. అందులో రూ.8.71 లక్షల నగదు, డమ్మీ పిస్తోలు, కత్తి, కారంపొడిం, మధ్యం బాటిల్ లభ్యం అయ్యాయి. కాగా.. దారి దోపిడీ గురించి తె లుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి, చేవెళ్ల ఏసీపీలు రమణగౌడ్, కిషన్‌గౌడ్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందు కు సీసీఎస్, ఎస్‌వోటీ పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు.