kumaram bheem asifabad- దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:39 PM
రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సును గురువారం కలెక్టర్ సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సును గురువారం కలెక్టర్ సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. భూ సమస్యలపై రైతులు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులతో సరి చూసి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంట శాల, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఐదేళ్ల వయస్సు నిండిన ప్రతి విద్యార్థిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, విద్యాశాఖాధికారి ఉదయ్‌బాబు, నాయబ్ తహసీల్దార్ పోచయ్య, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.