Appeal System: అప్పీల్ వ్యవస్థ అపహాస్యం!
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:07 AM
రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టంతో ‘అప్పీల్’ చేసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తహసీల్దార్ నిర్ణయాలపై ఆర్డీవోకు....
ఆన్‌లైన్‌లో లేదు.. దరఖాస్తులు తీసుకోరు
భూ భారతి నిబంధనలు పట్టించుకోవడం లేదంటూ రెవెన్యూ అధికారులపై విమర్శలు
కోర్టులను ఆశ్రయిస్తున్న దరఖాస్తుదారులు
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టంతో ‘అప్పీల్’ చేసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తహసీల్దార్ నిర్ణయాలపై ఆర్డీవోకు, ఆర్డీవో నిర్ణయాలపై కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునేలా చట్టంలో పొం దుపరిచారు. కలెక్టర్ నిర్ణయంపైనా అభ్యంతరముంటే ల్యాండ్ ట్రైబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే భూ భారతి పోర్టల్‌లో అప్పీల్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ పూర్తికాలేదు. దీంతో దరఖాస్తులు అప్‌లోడ్ చేసేందుకు అవకాశం లేకుండాపోయింది. కార్యాలయాలకు వెళ్తే అధికారులు దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఓ మహిళ అప్పీల్ కోసం వెళ్లగా ‘మీ సమస్య గడువు ముగిసిపోయింది.. అప్పీల్‌కు అవకాశం లేద’ని రెవెన్యూ అధికారులు పంపించేశారు. రంగారెడ్డి జిల్లాలో ఓ బాధితుడు ఆన్‌లైన్‌లో అప్పీల్‌కు అవకాశం లేకపోవడంతో వెళ్లి అధికారులను ప్రాధేయపడ్డాడు. కానీ.. భౌతికంగా దరఖాస్తు తీసుకోవడానికి వీల్లేదని, ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని అధికారులు కరాఖండీగా చెప్పారు. దీంతో అతను కోర్టును ఆశ్రయించడం రెవె న్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొంతమంది అధికారులు తమకు అవసరమైన పనులను చట్టంతో పనిలేకుండా ముగిస్తుండగా.. ప్రజల విషయంలో మాత్రం నిబంధనలంటూ సాకులు చెబుతున్నారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం భూ భారతి చట్టం సెక్షన్ 5 ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా తప్పులు, అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకునేందుకు అవకాశం లేకుండాపోయిందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామా దరఖాస్తుల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆందోళన చెందుతున్నారు. సెక్షన్ 7 మ్యుటేషన్ల వ్యవహారంలోనూ అభ్యంతరాలను ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఇవ్వడం లేదని, ఫిర్యాదులు స్వీకరించడం లేదని చెబుతున్నారు. అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడంతో దొడ్దిదారిలో డిలీషన్ అనే పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఇదో మోసపూరిత చర్యగా రెవెన్యూ వర్గాల్లో ప్రచారం ఉంది. పేరు తప్పు పడినా, విస్తీర్ణంలో పొరపాట్లు ఉన్నా తహసీల్దార్లే డిలీషన్ మాడ్యుల్‌లో పెట్టించి.. వారికి తోచినట్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ‘ప్రభుత్వం చట్టం చేసి నిబంధనలు తెచ్చింది. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కలెక్టర్లు, సీసీఎల్‌ఏ, రెవెన్యూ అధికారులు ఏదైనా ఆర్డర్ ఇస్తే అందులో సెక్షన్లు కోట్ చేయడం లేద’ని భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ పేర్కొన్నారు.