Apparaopet Palm Oil Factory Achieves: పామాయిల్‌లో మలేసియాకు దీటుగా..
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:45 AM
కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ...
అప్పారావుపేట ఫ్యాక్టరీలో 20శాతం ఓఈఆర్.. ఇది దేఽశంలోనే అత్యధిక అయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు
ఓఈఆర్ ఆధారంగానే పామాయిల్ ధర
రైతులకు మరింత లబ్ధి.. పెరిగిన రేటు ప్రకారం ప్రస్తుత ధరపై టన్నుకు అదనంగా రూ.500
మంత్రి తుమ్మల సహకారంతోనే సాధ్యం: అయిల్ ఫెడ్ చైర్మన్
అశ్వారావుపేట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 20.01 శాతం ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు (ఓఈఆర్)ను సాధించింది. ప్రాసెస్ చేసిన గెలల బరువు మేరకు నూనె బరువు శాతాన్ని ఈ ఓఈఆర్ సూచిస్తుంది. ఫ్యాక్టరీల్లో సాధించిన ఓఈఆర్ ఆధారంగానే పామాయిల్ గెలల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఫ్యాక్టరీల్లో క్రషింగ్ అయ్యే గెలలన్నింటికీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో వచ్చే ఓఈఆర్ శాతాన్ని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రస్తుతం పెరిగిన ఓఈఆర్ శాతం ప్రకారం టన్నుకు ప్రస్తుత ధరపై అదనంగా రూ.500 ధర రానుంది. కాగా పామాయిల్‌లో మలేసియాతో సమానంగా దేశంలోనే అత్యధిక ఓఈఆర్‌ను సాధించడం రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌కు గర్వకారణంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఉద్యోగులు, సిబ్బంది, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయిల్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులను రాఘవరెడ్డి సత్కరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే ఈ ఖ్యాతిని సొంతం చేసుకోగలిగామని ఆయిల్‌ఫెడ్ అధికారులు, పామాయిల్ రైతు సంఘం ప్రతినిధులు సంబరాలు జరుపుకొంటున్నారు.
3.30 లక్షల టన్నుల గెలల క్రషింగ్
రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో పామాయిల్ తోటలను వేశారు. ప్రస్తుతం లక్ష ఎకరాల్లో తోటలు విస్తరించి ఉండగా వాటిలో దాదాపు 60వేల ఎకరాల తోటలుదిగుబడినిస్తున్నాయి. పామాయిల్ గెలలను క్రషింగ్ చేయడానికి అశ్వారావుపేట, అప్పారావుపేటల్లో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో పామాయిల్ ఫ్యాక్టరీలను నిర్మించారు. ఈ ఫ్యాక్టరీల్లో వచ్చే ఆయిల్ రికవరీ శాతాన్ని బట్టే ప్రస్తుతం దేశంలో పామాయిల్ ధరలను నిర్ణయిస్తారనేది తెలిసిందే. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ తోటల విస్తరణ, కొత్త ఫ్యాక్టరీల నిర్మాణాలతో ఆయిల్‌ఫెడ్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో తొలిసారిగా లక్ష టన్నులు గెలలు, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 2.30 లక్షల టన్నులు మొత్తం 3.30 లక్షల టన్నుల గెలలను రికార్డు స్థాయిలో క్రషింగ్ చేశారు. ఉత్పత్తి సామర్థ్యమే కాకుండా దేశంలోనే అత్యధిక ఓఈఆర్ 20.01ను దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ప్యాక్టరీ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.