AP Government : 3.15 లక్షల కోట్ల బడ్జెట్?
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:08 AM
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
క్యాబినెట్ ఆమోదం అనంతరం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు!
గృహ నిర్మాణ శాఖకు రూ.8-9 వేల కోట్లు
హోంశాఖకు రూ.9 వేల కోట్ల కేటాయింపు
మహిళా, శిశు సంక్షేమానికి 3,700 కోట్లు
ఇందిరా ఆత్మీయ భరోసాకు రూ.350 కోట్లు
‘రాజీవ్ యువ వికాసం’కు రూ.6,000 కోట్లు
మిషన్ భగీరథ పథకానికి రూ.6,000 కోట్లు
రీజినల్ రింగు రోడ్డుకు రూ.1,525 కోట్లు
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఉదయం 11.44 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఉదయం 9.30 గంటలకు సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు, రాబడుల ఆధారంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దినట్టు సమాచారం. ఆశించిన మేర రాబడి రాకపోవడంతో ప్రభుత్వం కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పెట్టిన రూ.3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను చూసి అత్యుత్సాహానికి పోవద్దని, వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. సీఎం చేసిన సూచనల మేరకు బడ్జెట్‌కు తుది రూపు ఇచ్చారని... ఈసారి బడ్జెట్ రూ.3.10 లక్షల కోట్ల నుంచి రూ.3.15 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ, అందులో పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఖర్చు చేయలేకపోతోంది. ఈసారి వ్యయం రూ.2.20 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 7 లేదా 8 శాతం మేర నిధులను పెంచి కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని సమాచారం.
ఏ శాఖకు ఎంతెంత?
రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈసారి రూ.26 వేల కోట్లు కేటాయించాలని కోరింది. అడిగినంతా ఇవ్వకపోయినా.. పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాధాన్య ప్రాజెక్టుల దృష్ట్యా సాగునీటి రంగానికి భారీగానే కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖకు ఈసారి రూ.12-13 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లను కేటాయించారు. ఈసారి తమకు రూ.9 వేల కోట్లు కేటాయించాలని హోంశాఖ కోరింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు రూ.2,500 కోట్లను ప్రతిపాదించినట్లు సమాచారం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలకు అదనపు కేటాయింపులు అవసరమంటూ బడ్జెట్ కసరత్తు సందర్భంగా హోంశాఖ వివరించింది. 2024-25లో పోలీసు శాఖకు రూ.8,659 కోట్లు కేటాయించారు. ఈసారి స్వల్పంగా పెరుగుదల ఉంటుందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలీసు అకాడమీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జైళ్లు, అగ్నిమాపక విభాగం, స్పెషల్ బెటాలియన్లు, ఎస్పీఎ్‌ఫకు ఈసారి కూడా కేటాయింపులు పెద్దగా పెరగకపోవచ్చని తెలుస్తోంది. ఇక మహిళా శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ శాఖకు కొత్త బడ్జెట్‌లో రూ.3,700 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందులో అంగన్‌వాడీలలో చిన్న పిల్లల సంరక్షణకు రూ.100 కోట్ల వరకూ ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఇవి కాక, మహిళా శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే మహిళా సహకార సంస్థ, మహిళా కమిషన్‌కు కూడా కొంత మేర నిధులను కేటాయించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రూ.350 కోటు, రోడ్లు-భవనాల శాఖకు రూ.6000-7000 కోట్ల వరకు, మిషన్ భగీరథకు రూ.6000 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నారని సమాచారం.
ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం
మెట్రో రైలు రెండో దశ, స్కిల్ యూనివర్సిటీ, రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్), మూసీ రివర్ ఫ్రంట్ వంటి ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు పరిహారం చెల్లింపు కింద రూ.1,525 కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 శాతం మేర నిధుల్లో కొంత మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించవచ్చని తెలిసింది. వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ‘ఇందిరా ఆత్మీయ భరోసా’ పథకాన్ని ఈ ఫిబ్రవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. దీనికింద మొదటి దశలో 18,180 మంది లబ్ధిదారులకు రూ.6000 చొప్పున సొమ్మును అందజేసింది. మిగతా రూ.6000 చొప్పున ఇంకా అందించాల్సి ఉంది. కొత్త లబ్ధిదారులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ పథకానికి ఈసారి రూ.350 కోట్లను కేటాయిచనుందని సమాచారం. అలాగే.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిమిత్తం గృహనిర్మాణ శాఖకు ఈసారి రూ.8-9 వేల కోట్ల వరకు కేటాయించనున్నారని సమాచారం. నిరుద్యోగ యువత ఒక్కొక్కరికీ రూ.3 లక్షల లోపు ఆర్థిక సాయాన్ని అందించే ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి కొత్త బడ్జెట్‌లో రూ.6000 కోట్లను కేటాయించనుంది.