kumaram bheem asifabad- కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:47 PM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వీటిని ఎండగట్టాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు అన్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు.
కాగజ్‌నగర్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వీటిని ఎండగట్టాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు అన్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో సగభాగం ఉన్నటు వంటి మహిళలు నేటి పాలకుల విధానాల ఫలితంగా ఆర్థిక రాజకీయ రంగాల్లో వివక్షకు గురవుతున్నారని చెప్పారు. స్కీం వర్కర్లుగా పని చేస్తున్న ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, ఐకేపీ మెడికల్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం కల్పించడం లేదన్నారు. పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేస్తున్నదని చెప్పారు. ఒక వైపు ధరలు అధికంగా పెరుగడం, మరో వైపు విధులు నిర్వహించి కుటుంబాలను పోషించడం కూడా కష్టతరంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పూర్తిగా సంఘటిత, అసంఘటిత కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. ధనిక వర్గాలకు అనులకూలంగా ఉండేలా కేంద్రం చట్టాలను రూపొందించిందన్నారు. ఈ విషయాలపై అందరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాపడ్డారు. ఈ పెట్టుబడి దారి వ్యవస్థలో ఉత్పత్తి అయిన సరుకులు అనేక ఆఫర్లు ఇస్తున్నా కూడా అమ్ముడు పోవడం లేదన్నారు. కొనుగోలు శక్తి పెరుగాలంటే కనీస వేతనం రూ.26వేలు ఉండాలని సూచించారు. కాని జీతాల పెంపు విషయంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళలకు చట్టబద్ధమైన ప్రసూతి సెలువులు, ఈఎస్‌ఐ పీఎఫ్ పని ప్రదేశాల్లో కనీస వసతులు కూడా కల్పించడం లేదని తెలిపారు. అంతకు ముందకు పట్టణంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్‌వీ రమ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, జి వెంకటేష్, జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, ఆర్ త్రివేణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ముంజం శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు కూశన్న రాజన్న, దుర్గం దినక్, కోట శ్రీనివాస్ ముంజం ఆనంద్‌కుమార్, కార్తీక్, టీకానంద్, ఆనంద్, ఆర్ మహేష్ తదితరలు పాల్గొన్నారు.