US Fire Accident: అమెరికా అగ్ని ప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి మృతి
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:53 AM
అమెరికాలోని అల్బనీ ప్రాంతంలో ఇటీవల ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో...
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని అల్బనీ ప్రాంతంలో ఇటీవల ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అన్వే్‌షరెడ్డి సారపెల్లి అనే యువకుడు మృతి చెందినట్లు అమెరికాలోని కాన్సులెట్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడేనికి చెందిన అన్వే్‌షరెడ్డి కుటుంబం కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. న్యూయార్క్‌లోని అల్బనీలో డిసెంబర్ 4న ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. ప్రత్యేక బృందాలు వారిని ఆస్పత్రికి తరలించాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మొదట జనగామ జిల్లాకు చెందిన ఎంఎస్ చదువుతున్న విద్యార్థిని ఉడుముల సహజారెడ్డి మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు.. తాజాగా అన్వే్‌షరెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. చనిపోయిన విద్యార్థుల భౌతిక ఖాయాలను స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన ఆర్థిక సాయం కోసం ‘గో ఫండ్ మీ క్యాంపెయిన్’ను చేపట్టామని సహజారెడ్డి బంధువు రత్న గోపు తెలిపారు.